IT Raids: తెలంగాణ కాంగ్రెస్ నేతల ఇళ్లపై కొనసాగుతున్న ఐటీ దాడులు.. అధికారులను చూసి స్పృహ కోల్పోయిన సంపత్‌కుమార్ భార్య

IT Raids On Alampur Congress Candidate Sampath Kumar
  • అర్ధరాత్రి 12 గంటల సమయంలో అలంపూర్ కాంగ్రెస్ అభ్యర్థి ఇంటికి చేరుకున్న ఐటీ, విజిలెన్స్ అధికారులు
  • వారిని చూసి హైబీపీతో స్పృహ తప్పి పడిపోయిన మహాలక్ష్మి
  • అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలింపు
  • సంపత్ ఇంటి వద్దకు భారీగా చేరుకున్న కాంగ్రెస్ శ్రేణులు
  • పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత
తెలంగాణ కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. వివేక్ వెంకటస్వామి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వంటి నాయకుల ఇళ్లపై ఇప్పటికే దాడులు చేసిన అధికారులు తాజాగా అలంపూర్ కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్ ఇంట్లో తనిఖీలు చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే అయిన సంపత్‌కుమార్ నివసిస్తున్న వడ్డపల్లి మండలం శాంతినగర్‌లోని ఆయన నివాసానికి గత అర్ధరాత్రి 12 గంటల సమయంలో చేరుకున్న ఐటీ, విజిలెన్స్ అధికారులు సోదాలు చేపట్టారు.

ప్రచారానికి మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో సంపత్‌కుమార్ ప్రచారంలో తీరిక లేకుండా ఉన్నారు. ఈ సమయంలో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. అర్ధరాత్రి ఇంటికి వచ్చిన అధికారులను చూసి కంగారుపడిన సంపత్ భార్య మహాలక్ష్మి హైబీపీతో స్పృహతప్పి పడిపోయారు. కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. తనిఖీల సమయంలో సంపత్ ఇంట్లో లేరని సమాచారం. ఐటీ దాడుల సమాచారం అందుకున్న కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆయన ఇంటి వద్దకు చేరుకున్నాయి. పోలీసులు వారిని అడ్డుకోవడంతో కార్యకర్తలు రోడ్డపై బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
IT Raids
Sampath Kumar
Alampur Congress Candidate
Telangana Assembly Election

More Telugu News