G. Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్ నాటకాలు ఆడుతున్నాయి: కిషన్ రెడ్డి
- ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే రైతుబంధును ఎందుకు ఇవ్వలేదు? అని ప్రశ్న
- కుటుంబ పార్టీలను బీజేపీ వదిలిపెట్టదన్న కిషన్ రెడ్డి
- హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మారుస్తామని పునరుద్ఘాటన
రైతుబంధు విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు నాటకాలు ఆడుతున్నాయని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే రైతుబంధును ఎందుకు ఇవ్వలేదు? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒకే తాను ముక్కలు అని మండిపడ్డారు. ఆ రెండు కూడా కుటుంబ పార్టీలేనని ధ్వజమెత్తారు. కుటుంబ పార్టీలను బీజేపీ వదిలిపెట్టదని వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలను ప్రజలు చూశారని, బీజేపీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఆ రెండు పార్టీలపై తమ పోరాటం ఆపేది లేదన్నారు. అసలు హైదరాబాద్ పేరు ఏమిటి? ఎవరీ హైదర్? అందుకే భాగ్యనగరంగా మారుస్తామని స్పష్టం చేశారు. దేశంలో ఇప్పటికే చాలా నగరాల పేర్లు మారాయని గుర్తు చేశారు. పాతబస్తీని అభివృద్ధి చేయాలనేది తమ డిమాండ్ అన్నారు. ముస్లిం మహిళల ఆత్మగౌరవం కోసమే తాము ట్రిపుల్ తలాక్ రద్దు చేశామన్నారు.