Priyanka Gandhi: తొమ్మిదిన్నరేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదు: ప్రియాంక గాంధీ
- బీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చిన ప్రియాంక గాంధీ
- ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి అవగాహన, చిత్తశుద్ధి లేవని ఆగ్రహం
- మీ ఆశలు నెరవేరాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని పిలుపు
కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంకగాంధీ నేడు భువనగిరిలో నిర్వహించిన రోడ్డు షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... బీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు. తొమ్మిదిన్నరేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ఇక్కడ చిన్న చిన్న దుకాణాలు ఉన్నాయని, రైతులు, విద్యార్థులు ఉన్నారని, వారు ఏం కోరుకుంటున్నారో తనకు తెలుసునని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి ఏమాత్రం అవగాహన, చిత్తశుద్ధి లేవని దుయ్యబట్టారు.
ఏడేళ్ల క్రితం నోట్ల రద్దు సమయంలో ప్రజలు ఏటీఎం కేంద్రాలు, బ్యాంకుల వద్దకు డబ్బుల కోసం వెళ్లి ఎంతగా ఇబ్బంది పడ్డారో మనమంతా చూశామని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత కరోనా మనకు ఇబ్బందులను తీసుకు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ యువతకు ఉద్యోగాలు కావాలంటే... మీ ఆశలు నెరవేరాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రైతులు, నిరుద్యోగులు, మహిళలు ఇలా అందరి విషయాల్లో కేసీఆర్ ప్రభుత్వం కళ్లు మూసుకొని నిద్రపోతోందని విమర్శించారు.