KCR: మూడేళ్లకు మించి కౌలుకు ఇస్తే ఆ భూమి మీద హక్కులు పోతాయి: కేసీఆర్
- ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తును మార్చబోతున్నాయన్న కేసీఆర్
- కాంగ్రెస్ వల్లే రైతుబంధు ఆగిపోయిందని విమర్శ
- గులాబీ జెండాతో అందరం పోరాడితేనే తెలంగాణ వచ్చిందన్న ముఖ్యమంత్రి
ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తును మార్చబోతున్నాయని... ఓటర్లు వివేకంతో ఓటు వేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్, బీజేపీ నేతలు అబద్ధాలు చెపుతున్నారని విమర్శించారు. కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారని... ఎవరైనా మూడేళ్లకు మించి కౌలుకు ఇస్తే ఆ భూమి మీద హక్కులు పోతాయని చెప్పారు. తమ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ వల్ల రైతుల భూములు నిశ్చింతగా ఉన్నాయని... రైతుల వేలిముద్ర లేకుండా భూరికార్డులను మఖ్యమంత్రి కూడా మార్చలేరని అన్నారు.
రైతుబంధు ఆపాలని గత నెలలోనే ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారని కేసీఆర్ దుయ్యబట్టారు. తాను విన్నవిస్తే... ఈ నెల 28న రైతుబంధు ఇచ్చేందుకు ఎన్నికల సంఘం అనుమతించిందని చెప్పారు. కాంగ్రెస్ నేతలు మరోసారి ఫిర్యాదు చేస్తే రైతుబంధును మళ్లీ ఆపేసిందని తెలిపారు.
తెలంగాణను 1956లో ఊడగొట్టింది కాంగ్రెస్ పార్టీనే అని కేసీఆర్ విమర్శించారు. మన తెలంగాణను ఆంధ్రలో కలపడం వల్ల 50 ఏళ్లు ఎన్నో ఇబ్బందులు పడ్డామని చెప్పారు. 2004లో ప్రకటించిన తెలంగాణను 2014 వరకు ఇవ్వలేదని.. తాను నిరాహారదీక్షకు కూర్చున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ తల వంచిందని అన్నారు. గులాబీ జెండాను పట్టుకుని అందరం పోరాడిన తర్వాతే తెలంగాణను ఇచ్చారని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులతో పాటు పార్టీ చరిత్ర కూడా చూడాలని అన్నారు. చేవెళ్లలో నిర్వహించిన సభలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.