LAWASIA: భారతీయ జడ్జిలు రోజుకు 14-15 గంటలు పని చేస్తారు: ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి
- పెండింగ్ కేసుల తగ్గింపునకు కోర్టు సెలవుల కుదింపు అంశంపై ఎల్ఏడబ్ల్యూఏఎస్ఐఏ సమావేశంలో చర్చ
- భారతీయ జడ్జిలు రోజుకు 6 గంటలే పనిచేస్తారన్న భావన ఉందన్న జస్టిస్ ప్రతిభ సింగ్
- పని ఒత్తిడి కారణంగా న్యాయమూర్తులకు వర్క్-లైఫ్ బ్యాలెన్స్ సవాలుగా మారిందని వెల్లడి
భారత్‌లో జడ్జిలు తగినంత పనిచేయరన్న విమర్శను ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రతిభ ఎం సింగ్ తోసిపుచ్చారు. వాస్తవానికి భారతీయ జడ్జిలు రోజుకు సగటున 14 నుంచి 15 గంటల పాటు పనిచేస్తారని చెప్పారు.
కోర్టుల్లో కేసుల పెండింగ్ తగ్గించేందుకు సెలవులు కుదించాలన్న అంశంపై ఎల్ఏడబ్ల్యూఏఎస్ఐఏ సమావేశంలో జస్టిస్ సింగ్ ప్రసంగించారు. వర్క్-లైఫ్ బ్యాలెన్స్ సాధించడంలో న్యాయమూర్తులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.
‘‘భారత్‌లో జడ్జిలు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4.30 వరకూ పనిచేసి ఆ తరువాత గోల్ఫ్ ఆడుకోడానికి వెళతారన్న భావన ఉంది. కోర్టుకు వచ్చే ముందు రెండు గంటల పాటు మేము పనిచేస్తాం. ఆ తరువాత సాయంత్రం 4.30 వరకూ కోర్టులోనే ఉంటాం. అనంతరం మరో గంట కోర్టు కార్యకలాపాలను పరిశీలించి ఆ తరువాత తీర్పులను ఖరారు చేసి మరుసటి రోజు బ్రీఫ్స్‌ను చదువుతాం. వాస్తవానికి భారతీయ జడ్జిలు రోజుకు 14-15 గంటలు పనిచేస్తారు. వ్యక్తిగత జీవితం-వృత్తిజీవితం మధ్య సమతౌల్యం సాధించడం మాకు కష్టంగా ఉంటోంది’’ అని ఆమె పేర్కొన్నారు.
ఈ పనిభారం తాలూకు ప్రభావం న్యాయమూర్తుల కుటుంబాలపై కూడా పడుతోందని జస్టిస్ సింగ్ పేర్కొన్నారు. కాగా, చర్చలో పాల్గొన్న ఆస్ట్రేలియా, శ్రీలంక, నేపాల్ న్యాయమూర్తులు కూడా జస్టిస్ సింగ్ అభిప్రాయంతో ఏకీభవించారు. ఈ పరిస్థితి న్యాయమూర్తులకు ఓ సవాలుగా మారిందన్నారు. వివిధ దేశాల న్యాయమూర్తులు హాజరైన ఈ సమావేశంలో కోర్టులకు సంబంధించి పలు ఇతర అంశాలపై కూడా చర్చించారు.