China Respiratory Illness: చైనాలో వైరస్‌పై ఎయిమ్స్ వైద్యుడి క్లారిటీ

Respiratory Illness In China Due To Common Viruses says AIIMS Doctor

  • చైనా చిన్నారుల్లో శ్వాసకోశ వ్యాధి కేసుల పెరుగుదల
  • మరో కరోనా తరహా సంక్షోభం రాబోతోందన్న భయాలు
  • చైనాలో కొత్త వైరస్ ఏదీ బయటపడలేదన్న ఎయిమ్స్ సీనియర్ వైద్యుడు
  • కరోనా లాంటి మరో సంక్షోభానికి అవకాశం లేదని భరోసా

చైనాలో శ్వాసకోశ సంబంధిత కేసుల పెరుగుదలపై న్యూఢిల్లీలోని సీనియర్ ఎయిమ్స్ వైద్యుడు తాజాగా స్పందించారు. చలికాలంలో ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్లు సాధారణమేనని, కొవిడ్ తరహాలో మరో సంక్షోభానికి అవకాశమే లేదని మాత-శిశు విభాగం అధిపతి డా. ఎస్‌కే కాబ్రా భరోసా ఇచ్చారు. ఇటీవల కాలంలో చైనాలోని ఉత్తర ప్రాంతాల్లో చిన్నారులు పెద్ద సంఖ్యలో న్యుమోనియా తరహా శ్వాసకోశ వ్యాధి బారిన పడి ఆసుపత్రి పాలవుతున్న విషయం తెలిసిందే. ఇది కరోనా సంక్షోభం లాంటి పరిస్థితికి దారి తీస్తుందన్న ఆందోళన నడుమ డా.ఎస్‌కే కాబ్రా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 

‘‘అక్టోబర్, నవంబర్ కాలంలో చైనాలో అకస్మాత్తుగా చిన్నారుల్లో శ్వాసకోశ వ్యాధి కేసులు పెరిగాయన్న వార్తలు వస్తున్నాయి. ఈ కేసుల్లో మైకోప్లాస్మా కనిపించింది కానీ కొత్త, అసాధారణ వైరస్‌లు ఏవీ బయటపడలేదు. కొత్త వ్యాధికారక జీవి వచ్చిందనేందుకు సంకేతాలేవీ లేవు. మరో కొవిడ్ తరహా సంక్షోభం వస్తుందని చెప్పేందుకు ప్రస్తుతం అవకాశం లేదు’’ అని ఆయన స్పష్టం చేశారు. చలికాలంలో కనిపించే సాధారణ వైరస్‌లే చైనా కేసుల్లో బయటపడుతున్నాయని పేర్కొన్నారు. 

సాధారణంగా ఐదేళ్ల లోపు చిన్నారులు ఏటా 3 నుంచి 8 సార్లు శ్వాసకోస ఇన్ఫెక్షన్ల బారిన పడతారని, వాటి నుంచి కోలుకున్నాక వారి రోగనిరోధక శక్తి మరింతగా బలపడుతుందని డా. కాబ్రా తెలిపారు. ఫలితంగా, ఐదేళ్లు దాటాక చిన్నారులు ఇన్ఫెక్షన్ల బారిన పడటం తగ్గిపోతుందని వివరించారు. చైనాలో కఠినమైన లాక్‌డౌన్ కారణంగా చిన్నారులకు ఈ అవకాశం లేకుండా పోయిందని పేర్కొన్నారు. లాక్‌డౌన్ ఎత్తేశాక చిన్నారుల్లో రోగనిరోధక శక్తి సరిపోక పెద్దసంఖ్యలో ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నారని వివరించారు.

  • Loading...

More Telugu News