Mother jailed: కూతుర్లపై అఘాయిత్యానికి సహకరించిన తల్లికి 40 ఏళ్ల జైలు.. 20 వేల ఫైన్
- కేరళలో ఘోరం.. మైనర్ కూతుర్లపై మహిళ ప్రియుడి అత్యాచారం
- ఇంట్లోంచి పారిపోయి నానమ్మ ఇంటికి చేరుకున్న పిల్లలు
- తాజాగా తీర్పు వెలువరించిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు
కళ్ల ముందే కన్న బిడ్డలను లైంగిక వేధింపులకు గురిచేస్తుంటే ఏ తల్లి అయినా శివంగిలా మారుతుంది.. కాళికలా విరుచుకుపడుతుంది.. కానీ కేరళలో ఓ కన్నతల్లి మాత్రం తన ప్రియుడికి సహకరించింది. కూతుళ్లను పదే పదే ప్రియుడి ఇంటికి తీసుకెళ్లి వేధింపులకు సహకరించింది. ఈ ఘోరానికి పాల్పడిన ఆ తల్లికి తాజాగా కేరళ ఫాస్ట్ ట్రాక్ కోర్టు శిక్ష విధించింది. 40 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.20 వేల జరిమానా కట్టాలని ఆదేశించింది. పోక్సో చట్టం కింద విచారించి ఈ తీర్పు వెలువరించింది.
తిరువనంతపురం పట్టణానికి చెందిన సదరు మహిళ భర్త మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో పిల్లలను తీసుకుని ఆమె విడిగా ఉంటోంది. ఈ క్రమంలోనే శిశుపాలన్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తరచుగా ప్రియుడి ఇంటికి వెళ్లి వచ్చేది. బాధితురాలి కూతుళ్లపై కన్నేసిన శిశుపాలన్.. వారిని తన ఇంటికి తీసుకురమ్మని ఒత్తిడి చేశాడు. ప్రియుడి కోసం కన్న బిడ్డలని కూడా చూడకుండా కూతుళ్లను తీసుకుని వెళ్లేది. తన ముందే ప్రియుడు తన కూతుళ్లపై లైంగిక వేధింపులకు పాల్పడుతుంటే ఆపాల్సింది పోయి సహకరించింది.
ఆ మైనర్ పిల్లలు ఇద్దరూ తరచుగా వేధింపులు ఎదుర్కొన్నారు. 2018-19 మధ్య ఈ దారుణాలు చోటుచేసుకున్నాయి. తల్లి ప్రవర్తన, శిశుపాలన్ వేధింపులు భరించలేక పిల్లలు తమ నానమ్మ ఇంటికి పారిపోయారు. మనవరాళ్లను పిల్లల సంరక్షణ కేంద్రంలో చేర్పించిందా నానమ్మ. అక్కడ ఇచ్చిన కౌన్సెలింగ్ లో వారు తమపై జరిగిన వేధింపులను బయటపెట్టారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి వారి తల్లిని, ఆమె ప్రియుడు శిశుపాలన్ ను అరెస్టు చేసి జైలుకు తరలించారు. విచారణ సాగుతుండగానే శిశుపాలన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాజాగా బాధితురాలికి శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. నిందితురాలు మాతృత్వానికే సిగ్గుచేటని, ఆమె నేరం క్షమార్హం కాదనీ న్యాయమూర్తి ఆర్. రేఖ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.