Rahul Gandhi: హైదరాబాద్ లో డెలివరీ బాయ్స్, జీహెచ్ఎంసీ కార్మికుల కష్టాలు విన్న రాహుల్‌గాంధీ.. ఊడ్చిఊడ్చి చాతీలో నొప్పి వస్తోందన్న కార్మికులు

Rahul Gandhi Meets Delivery Boys and GHMC Workers hardships
  • తెలంగాణ ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొంటున్న రాహుల్‌గాంధీ
  • హైదరాబాద్‌లో పలు ప్రజాసంఘాలతో సమావేశాలు
  • తమ సమస్యలు చెప్పుకుని బాధపడిన డెలివరీ బాయ్స్, జీహెచ్ఎంసీ కార్మికులు
  • వారి సమస్యలను శ్రద్ధగా ఆలకించిన కాంగ్రెస్ అగ్రనేత
  • అధికారంలోకి రాగానే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పర్యటిస్తున్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ.. హైదరాబాద్‌లో పలు ప్రజాసంఘాలతో సమావేశాలు నిర్వహిస్తూ సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ కార్మికులు, ఆటోడ్రైవర్లు, డెలివరీ బాయ్స్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారి దినచర్య, ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారు చెప్పింది శ్రద్ధగా విన్నారు. 

డెలివరీ బాయ్స్ మాట్లాడుతూ తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఏకరువు పెట్టారు. ప్రమాదాలు జరిగినా, సరుకులు పోయినా డెలివరీ ఏజెన్సీలు తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టాలు ఎదురైనప్పటికీ కుటుంబ పోషణ కోసం పని వదులుకోలేకపోతున్నామని చెప్పారు. ఏజెన్సీలు తమకు పెట్రోలు ధర కూడా చెల్లించడం లేదని, చివరి నిమిషంలో ఆర్డర్‌ను కస్టమర్ రద్దు చేసుకుంటే ఆ భారాన్ని కూడా తామే భరించాల్సి వస్తుందన్నారు. తమకు ఈఎస్ఐ, పీఎఫ్‌లాంటివి లేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. తమకు ఆ రెండూ అందించాలని కోరారు. 

జీహెచ్ఎంసీ కార్మికులు మాట్లాడుతూ.. తమకు పింఛన్ లేదని, ఐదు గంటల్లోగా థంబ్స్ అప్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. నిరంతరాయంగా స్వీపింగ్ చేయడం వల్ల చాతీలో నొప్పి వస్తోందని చెప్పారు. వారి ఇబ్బందులను శ్రద్ధగా విన్న రాహుల్‌గాంధీ తాము అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రాజస్థాన్లో చేసినట్టుగానే సంక్షేమ చర్యలు చేపడతామని భరోసా ఇచ్చారు.
Rahul Gandhi
Congress
Telangana
Delivery Boys
GHMC Workers

More Telugu News