Car rescue: పిల్లిని కాపాడబోయి బిల్డింగ్ పై నుంచి పడ్డ మహిళ.. స్పాట్ లోనే మృతి
- కోల్ కతాలో ఘోరం.. తీవ్ర గాయాలతో రక్తస్రావం
- వద్దన్నా వినిపించుకోలేదంటున్న అపార్ట్ మెంట్ వాసి
- పిల్లి కోసం రిస్క్ చేసి ప్రాణం పోగొట్టుకున్న మహిళ
ప్రేమగా పెంచుకుంటున్న పిల్లి కోసం ఓ మహిళ తన ప్రాణాలనే రిస్క్ లో పెట్టింది.. భారీ భవంతి పై నుంచి బాల్కనీ కిందికి దిగేందుకు ప్రయత్నించింది. పక్క అపార్ట్ మెంట్ లో ఉన్న మహిళ ఒకరు వారించినా వినిపించుకోలేదు. పట్టుజారి కిందపడడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే చనిపోయింది. బాల్కని కింద చిక్కుక్కున్న పిల్లిని కాపాడే ప్రయత్నంలో ఈ ఘోరం చోటుచేసుకుంది. కోల్ కతాలోని టోలిగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ప్రమాదం వివరాలు ఇలా ఉన్నాయి.
లేక్ వ్యూ అపార్ట్ మెంట్ లో అంజనా దాస్ తన తల్లితో కలిసి ఉంటోంది. సిటీలో మరోచోట ఉన్న ఇంటికి రీమోడలింగ్ చేయిస్తుండడంతో లేక్ వ్యూ అపార్ట్ మెంట్ లో అద్దెకు దిగింది. తనతో పాటు తన పెంపుడు పిల్లులు మూడింటినీ తెచ్చుకుంది. అయితే, వాటిలో రెండు పిల్లులు కనిపించకుండా పోయాయి. వాటికోసం అంజనా వెతుకుతోంది. సోమవారం ఉదయం మార్నింగ్ వాక్ కోసం టెర్రస్ పైకి వెళ్లిన అంజనాకు టెర్రస్ కింద బాల్కనీలాంటి ప్రాంతంలో చిక్కుకున్న పిల్లి కనిపించింది.
దీంతో దానిని కాపాడేందుకు అంజనా టెర్రస్ పై నుంచి కిందకు దిగింది. పిల్లిని చేరుకునే క్రమంలో ఆమె కాలు జారి 8 అంతస్తుల పై నుంచి కింద పడింది. తీవ్ర రక్తస్రావం అవుతుండడంతో అంజనాను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. రక్తస్రావం చాలా ఎక్కువగా కావడంతో ఆసుపత్రికి తీసుకు వస్తుండగానే అంజనా చనిపోయిందని డాక్టర్లు ప్రకటించారు. కాగా, టెర్రస్ పై నుంచి కిందికి దిగుతుండగా అంజనాను చూశానని, వద్దని వారించినా ఆమె వినిపించుకోలేదని పక్క అపార్ట్ మెంట్ మహిళ ఒకరు చెప్పారు.