KTR: ముఖ్యమంత్రికి లోకల్... నాన్ లోకల్ ఉంటుందా?: కామారెడ్డిలో మంత్రి కేటీఆర్
- కేసీఆర్ తెలంగాణ మొత్తానికే లోకల్ అన్న కేటీఆర్
- కామారెడ్డిని అభివృద్ధి చేసే బాధ్యతను తీసుకుంటానన్న మంత్రి
- తెలంగాణలో ఉన్నన్ని సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలోనూ లేవన్న కేటీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లోకల్... నాన్ లోకల్ అని ఉంటుందా? కేసీఆర్ తెలంగాణ మొత్తానికే లోకల్ అని మంత్రి కేటీఆర్ అన్నారు. కామారెడ్డిలో నిర్వహించిన రోడ్డు షోలో ఆయన మాట్లాడుతూ... అన్ని రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఉన్నారని.. కానీ ఇక్కడ తెలంగాణ సాధించిన సీఎం ఉన్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులలో ఎవరు లోకల్? అని ప్రశ్నించారు. కేసీఆర్ అమ్మగారి ఊరు ఇక్కడే సమీపంలోని కోనాపూర్... అలాంటప్పుడు ఎవరు లోకల్? అని నిలదీశారు. కేసీఆర్ రాకతో కామారెడ్డి రూపురేఖలు మారిపోతాయన్నారు. పట్టణాన్ని అభివృద్ధి చేసే బాధ్యతను తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. తెలంగాణలో ఉన్న సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలోనూ లేవన్నారు.
బీడీ కార్మికులకు పెన్షన్లు ఇచ్చే ప్రభుత్వం తెలంగాణ మాత్రమే అన్నారు. బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే బీడీ కార్మికుల పెన్షన్‌కు కటాఫ్ తేదీని తొలగిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో నాలుగున్నర లక్షల మంది బీడీ కార్మికులకు పెన్షన్లు ఇస్తున్నట్లు తెలిపారు. మళ్లీ అధికారంలోకి వస్తే పెన్షన్లను దశలవారీగా రూ.5వేలకు పెంచుతామన్నారు. జనవరిలో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామన్నారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికీ రూ.5 లక్షల బీమా కల్పిస్తామన్నారు. అసైన్డ్ భూములపై యజమానులకు పూర్తి హక్కులు కల్పిస్తామని తెలిపారు.