teacher jobs: నన్నే ప్రశ్నిస్తావా.. నీకు ప్రభుత్వ ఉద్యోగం రాకుండా చేస్తా: మహారాష్ట్ర మంత్రి వార్నింగ్
- టీచర్ పోస్టుల భర్తీపై మంత్రిని ప్రశ్నించిన యువతి
- తనను నిలదీయడంపై మండిపడ్డ మంత్రి దీపక్ కేసర్కార్
- నీ పేరును అధికారులకు పంపించి డిస్ క్వాలిఫై చేయిస్తానని బెదిరింపు
రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీ ఇంకెప్పుడు చేస్తారని అడిగిన ఓ యువతిని సాక్షాత్తూ విద్యాశాఖ మంత్రి బెదిరించాడు.. నీకు ప్రభుత్వ ఉద్యోగం రాకుండా చేస్తానంటూ హెచ్చరించాడు. నీ పేరు, వివరాలను అధికారులకు పంపించి నిన్ను డిస్ క్వాలిఫై చేయిస్తానని బహిరంగంగా, మీడియా ముందే వార్నింగ్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ బెదిరింపులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బీడ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మహారాష్ట్ర విద్యా శాఖ మంత్రి కేసర్కార్ హాజరయ్యారు. సభలో ప్రసంగించిన తర్వాత మంత్రి వెళ్లిపోతుండగా స్థానికులు ఆయనకు పలు విజ్ఞఫ్తులు చేస్తున్నారు. వారితో మాట్లాడుతూ మంత్రి ముందుకు సాగుతున్నారు. ఇంతలో ఓ యువతి మంత్రి ముందుకు వచ్చి టీచర్ పోస్టుల భర్తీ ఎప్పుడు చేస్తారంటూ అడిగింది. ఆ ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి జవాబిచ్చారు.
అయితే, నియామక ప్రాసెస్ ఎంతకాలం సాగదీస్తారని, ఎదురు చూసి చూసి తమకు విసుగుపుడుతోందని ఆ యువతి విమర్శించింది. దీంతో కోపం తెచ్చుకున్న మంత్రి కేసర్కార్.. ఇలా క్రమశిక్షణ లేకుండా మాట్లాడుతున్నావేంటని, నీ పేరు వివరాలు తీసుకుని ఇప్పుడే అధికారులకు పంపిస్తానని, నిన్ను డిస్ క్వాలిఫై చేయాలని ఆదేశిస్తానని బెదిరించారు.