KCR: రేపు చింతమడకలో ఓటు హక్కు వినియోగించుకోనున్న సీఎం కేసీఆర్
- చింతమడకలోని 13వ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకోనున్న కేసీఆర్
- హెలిప్యాడ్, పోలింగ్ కేంద్రం వద్ద పోలీస్ బందోబస్తుపై కమిషనర్ ఆదేశాలు
- ప్రతిసారి చింతమడకలోనే ఓటు హక్కు వినియోగించుకుంటున్న కేసీఆర్
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం రేపు చింతమడకకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామంలో పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. కేసీఆర్ చింతమడక గ్రామంలోని 13వ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ నేపథ్యంలో సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత బుధవారం చింతమడక చేరుకొని ఏర్పాట్లను పరిశీలించారు. హెలిప్యాడ్, పోలింగ్ కేంద్రం వద్ద పోలీస్ బందోబస్తుపై ఆదేశాలు ఇచ్చారు. ప్రతిసారి కేసీఆర్ స్వగ్రామంలో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా జరిగే అసెంబ్లీ ఎన్నికలకు పోలీస్ అధికారులు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. స్థానిక సాయుధ బలగాలు, హోంగార్డులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, హోంగార్డ్లు, రైల్వే పోలీసులతో పాటు కేంద్ర బలగాలు సీఆర్పీఎఫ్, ఝార్ఖండ్ సహా వివిధ రాష్ట్రాల ఆర్మ్డ్ ఫోర్స్‌తో బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాలను జియో ట్యాగింగ్ చేశారు. పలుచోట్ల డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశారు.