Telangana Assembly Election: మరి కాసేపట్లో తెలంగాణలో పోలింగ్ మొదలు!

Polling in Telangana to begin shortly

  • ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకూ ఓటింగ్
  • మొత్తం 119 నియోజకవర్గాల్లో పోలింగ్
  • రాష్ట్రంలో 3.26 కోట్ల మంది ఓటర్లు, బరిలో 2,290 మంది అభ్యర్థులు 
  • 75 వేల మంది పోలీసు బలగాలతో భద్రతా ఏర్పాట్లు 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. మరికాసేపట్లో పోలింగ్ మొదలు కానుంది. మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో 2,290 మంది అభ్యర్థుల భవిత్యం నేడు తేలనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకూ పోలింగ్ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3.26 కోట్లు కాగా పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. 68 నియోజకవర్గాల్లో మహిళలే అభ్యర్థుల గెలుపు ఓటములు నిర్ణయిస్తారు. ఈ ఎన్నికల్లో యువత సంఖ్య అధికంగా ఉండటం మరో ప్రత్యేకత. గతంలో ఎన్నడూ చూడని విధంగా ఈసారి 18-19 ఏళ్ల వయసున్న 9,99,667 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

పోలింగ్ భద్రతా ఏర్పాట్ల కోసం 75 వేల మంది పోలీసు బలగాలను రంగంలోకి దింపారు. వీరిలో రాష్ట్రానికి చెందిన 40 వేల మంది, సరిహద్దు రాష్ట్రాలకు చెందిన 15 వేల మంది పోలీసులు, 375 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలు ఉన్నాయి. రాష్ట్రంలో సమస్యాత్మకంగా మారిన 13 అసెంబ్లీ నియోజకవర్గాలు, 12,311 పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. మొత్తం 2 లక్షలకు పైగా సిబ్బంది పోలింగ్ ప్రక్రియలో పాలుపంచుకుంటున్నారు. ఎన్నికల సంఘం నియమించిన 3,800 మంది సెక్టార్ ఆఫీసర్లు, 22 వేల మంది సూక్ష్మ పరిశీలకులు పోలింగ్‌ను పర్యవేక్షించనున్నారు. 

శేరిలింగంపల్లిలో అత్యధికంగా 7,32,560 మంది ఓటర్లు ఉండగా భద్రాచలం నియోజకవర్గంలో అత్యల్పంగా 1,48,713 మంది ఓటర్లున్నారు. ఎల్బీనగర్‌ నియోజకవర్గంలో గరిష్ఠంగా 48 మంది అభ్యర్ధులు పోటీ పడుతుండగా బాన్సువాడ, నారాయణపేటలో అత్యల్పంగా ఏడుగురు చొప్పున బరిలో నిలిచారు. అభ్యర్థుల సంఖ్యను బట్టి కొన్ని నియోజకవర్గాల్లో 55 బ్యాలెట్ యూనిట్లు , మరికొన్నింటిలో రెండు లేదా మూడు బ్యాలెట్ యూనిట్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే పోలింగ్ పూర్తయిన నాలుగు రాష్ట్రాలతో పాటూ తెలంగాణ ఎన్నికల ఓట్ల లెక్కింపును డిసెంబర్ 3న చేపట్టి అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నారు.

  • Loading...

More Telugu News