KTR: బాధ్యత గల పౌరుడిగా నా బాధ్యతను నిర్వర్తించాను: కేటీఆర్
- నందినగర్ లో ఓటు హక్కును వినియోగించుకున్న కేటీఆర్
- ఒక మంచి నాయకుడికి ఓటు వేశానని వ్యాఖ్య
- ప్రజలు బయటకు వచ్చి నచ్చిన పార్టీకి, నచ్చిన నాయకుడికి ఓటు వేయాలని విన్నపం
హైదరాబాద్ లోని నందినగర్ లో మంత్రి కేటీఆర్ దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ... ఒక బాధ్యత గల పౌరుడిగా తాను ఓటు హక్కును వినియోగించుకుని తన బాధ్యతను నిర్వహించానని చెప్పారు. అభివృద్ధి కోసం పాటు పడే పార్టీకి, ఒక మంచి నాయకుడికి ఓటు వేశానని చెప్పారు. అందరూ కూడా బయటకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలు ఓటు వేయడానికి బయటకు రావాలని కోరారు. నగర ప్రజలు బయటకు వచ్చి నచ్చిన నాయకుడికి, నచ్చిన పార్టీకి ఓటు వేయాలని చెప్పారు. హైదరాబాద్ ప్రజలు ఓటింగ్ కు దూరంగా ఉండటం మంచిది కాదని అన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యత గల పౌరుడిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. గత ఎన్నికల్లో హైదరాబాద్ లో అత్యంత తక్కువగా కేవలం 50 శాతం ఓటింగ్ మాత్రమే జరిగిన సంగతి తెలిసిందే.