Polling: బీఆర్ఎస్ కండువాతో వెళ్లి ఓటేసిన మంత్రి అల్లోల, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

BRS Candidates election code violation

  • ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన బీఆర్ఎస్ అభ్యర్థులు
  • మెడలో కండువాతో ఓటేయడంపై విమర్శలు
  • మండిపడుతున్న ప్రతిపక్షాల అభ్యర్థులు

తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ కొనసాగుతోంది. సాధారణ ప్రజలతో పాటు సెలబ్రెటీలు క్యూలో నిలుచుని ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కొన్నిచోట్ల ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మెడలో బీఆర్ఎస్ కండువాతో వెళ్లి ఓటేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బెల్లంపల్లి అభ్యర్థి దుర్గం చిన్నయ్య కూడా ఇదేవిధంగా చేశారు. మెడలో గులాబీ కండువాతో వెళ్లి ఓటేశారు.

మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ నియోజకవర్గంలోని ఎల్లపల్లి గ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే, పోలింగ్ కేంద్రంలోకి పార్టీ కండువాతో వెళ్లడం వివాదాస్పదంగా మారింది. ఎన్నికల కమిషన్ నిబంధన ప్రకారం.. పోలింగ్ బూత్ లోకి పార్టీ చిహ్నాలను కానీ, వాటిని పోలిన వస్తువులు, గుర్తులను కానీ తీసుకువెళ్లకూడదు. ప్రతీ పోలింగ్ కేంద్రం వద్ద ఉండే పోలీసులు ఈ రూల్ ను కచ్చితంగా అమలు చేస్తారు. ఎవరైనా తెలిసి లేదా తెలియకుండా పార్టీ గుర్తులను కానీ వస్తువులను కానీ వెంట తీసుకువస్తే అడ్డుకుంటారు. అయితే, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఏకంగా మెడలో గులాబీ కండువాతో వెళ్లి ఓటేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

బెల్లంపల్లిలో అధికార పార్టీ తరఫున పోటీలో ఉన్న దుర్గం చిన్నయ్య కూడా ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారు. పార్టీ కండువాతో పోలింగ్ బూత్ లోకి వెళ్లారు. జెండావెంకటాపూర్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా గులాబీ కండువాతో లోపలికి వెళ్లడం, ఓటేయడం మీడియా కెమెరాలకు చిక్కింది. ఈ చర్య అక్కడున్న ఓటర్లను ప్రభావితం చేయడమేనని ప్రతిపక్షాల అభ్యర్థులు మండిపడుతున్నారు. అధికార పార్టీ అభ్యర్థుల కోడ్ ఉల్లంఘనలపై ఎన్నికల కమిషన్ ఏం చర్యలు తీసుకోబోతోందనే విషయంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

  • Loading...

More Telugu News