AARAA Survey: హరీశ్ రావుకు తెలంగాణలోనే అత్యధిక మెజారిటీ వస్తుందన్న 'ఆరా' సంస్థ
- తెలంగాణలో ముగిసిన ఎన్నికల పోలింగ్
- ఇక అందరి దృష్టి ఈ నెల 3న వచ్చే ఫలితాలపైనే!
- ఆసక్తికర అంచనాలు వెలువరించిన 'ఆరా' సర్వే సంస్థ
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో, 'ఆరా' సర్వే సంస్థ ఎగ్జిట్ పోల్ వివరాలు పంచుకుంది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర అంచనాలు వెలువరించింది. మంత్రి హరీశ్ రావుకు తెలంగాణలో అందరికంటే అత్యధిక మెజారిటీ లభించే అవకాశం ఉందని ఆరా సంస్థ వెల్లడించింది.
అదే సమయంలో సీఎం కేసీఆర్ గజ్వేల్ లో తక్కువ మెజారిటీతో గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. కామారెడ్డిలో కేసీఆర్ కు రెండో స్థానం తప్పదని అంచనా వేసింది. కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డికి గెలుపు చాన్సులు కనిపిస్తున్నాయని వెల్లడించింది.
బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక రథసారథి కేటీఆర్ కు సిరిసిల్లలో మంచి మెజారిటీ వస్తుందని 'ఆరా' తెలిపింది.
ఇక, మేడ్చల్ లో మంత్రి మల్లారెడ్డి స్వల్ప ఆధిక్యంతో గెలుస్తారని, మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి స్వల్ప తేడాతో గెలిచే అవకాశం ఉందని వివరించింది. కొడంగల్ లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఓ మోస్తరు మెజారిటీతో గెలిచే సూచనలు ఉన్నాయని 'ఆరా' సంస్థ వెల్లడించింది.
అటు, కరీంనగర్ లో ఆసక్తికర ఫలితం వస్తుందని, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కంటే మంత్రి గంగుల కమలాకర్ కు స్వల్ప ఆధిక్యం వస్తుందని అంచనా వేసింది. హుజూరాబాద్ లో ఈటల, కౌశిక్ రెడ్డి మధ్య నువ్వానేనా అనే విధంగా పోటీ ఉంటుందని వివరించింది.