Barrelakka: కొల్లాపూర్‌లో బర్రెలక్కకు ఎన్ని ఓట్లు పడతాయి?.. ఎగ్జిట్ పోల్ అంచనా ఇదే!
- 15 వేల ఓట్లు వస్తాయని అంచనా వేసిన ‘ఆరా మస్తాన్’ సర్వే
- శిరీష గెలవకపోయినా గట్టి పోటీ ఇస్తుందని విశ్లేషణ
- కొల్లాపూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు గెలుస్తారని వెల్లడి
కొల్లాపూర్ శాసనసభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసి యావత్ దేశం దృష్టిని ఆకర్షించిన బర్రెలక్క (శిరీష) విజయం సాధిస్తుందా? గురువారం ముగిసిన పోలింగ్‌లో ఆమెకు ఎన్ని ఓట్లు పడి ఉంటాయి? అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. మరీ ముఖ్యంగా పోలింగ్ ముగిసిపోవడంతో బర్రెలక్క గెలుపుపై అంచనాలు ఏ విధంగా ఉన్నాయనే చర్చ ఊపందుకుంది. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం వెలువడిన ‘ఆరా మస్తాన్ సర్వే’ శిరీషకు 15 వేల వరకు ఓట్లు రావొచ్చని లెక్కగట్టింది. శిరీష గెలవకపోయినా గట్టి పోటీ ఇస్తుందని, ఓటర్లను ఆమె పెద్ద సంఖ్యలో ఆకర్షించుకోగలిగిందని పేర్కొంది. ఇక ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు గెలుపొందనున్నారని విశ్లేషించింది.
ఇదిలావుంచితే తెలంగాణ ఎన్నికలు -2023లో కీలక ఘట్టం పూర్తయ్యింది. గురువారం సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యింది. సాయంత్రం వెలువడిన ఎగ్జిట్ పోల్ సర్వేలు కాంగ్రెస్‌కే పట్టం కట్టాయి. హస్తం పార్టీ అధికారంలోకి వస్తుందని విశ్లేషించాయి. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నీ బోగస్ అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కొట్టిపారేశారు. ఎగ్జిట్ పోల్స్ అంచనా తప్పిన సందర్భాలను ఎన్నో చూశామని, బీఆర్ఎస్ 70 సీట్లు గెలుచుకుంటుందని అన్నారు. ఎగ్జిట్ పోల్స్‌ను చూసి బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని ధైర్యం చెప్పారు.