Air India: విమానంలో నీటి లీకేజీ.. స్పందించిన ఎయిర్ ఇండియా
- నవంబర్ 24న గాట్విక్ నుంచి అమృత్‌సర్ వెళ్లిన ఎయిర్ ఇండియా విమానంలో ఘటన
- ఓవర్ హెడ్ బిన్స్ నుంచి కొన్ని చోట్ల ధారగా కారిన నీరు, నెట్టింట వీడియో వైరల్
- ఘటనపై స్పందించిన ఎయిర్ ఇండియా
- ప్రభావిత సీట్లలోని ప్రయాణికులను మరో చోటుకు మార్చినట్టు వెల్లడి
ఎయిర్ ఇండియా విమానం క్యాబిన్‌లో పైకప్పు నుంచి నీరు ధారగా కారుతున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పైకప్పులో లగేజీ పెట్టుకునేందుకు ఉద్దేశించిన ఓవర్‌హెడ్ బిన్స్ అడుగుభాగం నుంచి ధారగా నీరు కారుతూ సీట్లపై పడుతున్న దృశ్యాలతో నెట్టింట విమర్శలు వెల్లువెత్తాయి. ఘటనపై స్పందించిన ఎయిర్ ఇండియా సంస్థ..దీన్నో అసాధారణ ఘటనగా అభివర్ణించింది.
ఎయిర్ ఇండియా విమానం.. నవంబర్ 24న గాట్విక్ నుంచి అమృత్‌సర్‌కు బయల్దేరింది. ఈ క్రమంలోనే ప్రయాణికులు కూర్చునే క్యాబిన్ పైకప్పు నుంచి ఓ చోట లీకేజీ మొదలైంది. అయితే, లీకేజీ కింద సీట్లలో కూర్చున్న ప్రయాణికులను తక్షణమే మరో చోటుకు మార్చామని సంస్థ తెలిపింది. ప్రయాణికుల భద్రత, సౌకర్యానికి తాము కట్టుబడి ఉన్నట్టు తెలిపింది. లీకేజీకి గల కారణాలు మాత్రం తెలియరాలేదు.