Gated community roads: గేటెడ్ కమ్యూనిటీల్లో రోడ్లపై హక్కుల విషయంలో కర్ణాటక హైకోర్టు కీలక తీర్పు
- గేటెడ్ కమ్యూనిటీల్లోని రోడ్లపై ప్రజలందరికీ హక్కు ఉంటుందన్న కర్ణాటక హైకోర్టు
- కమ్యూనిటీల్లో ఉంటున్నవారికే వీధుల్లో రాకపోకలపై హక్కులు ఉంటాయన్న వాదన తిరస్కరణ
- లే అవుట్ అభివృద్ధికి సంబంధించిన అనుమతుల్లో ఈ విషయం స్పష్టంగా ఉందని వ్యాఖ్య
లే అవుట్ హక్కులను స్థానిక సంస్థలకు బదిలీ చేశాక లేఅవుట్ వీధులపై లాండ్ ఓనర్లకు, డెవలపర్లకు ఎలాంటి హక్కులూ ఉండవని కర్ణాటక హైకోర్టు తాజాగా స్పష్టం చేసింది. గేటెడ్ కమ్యూనిటీ వీధుల వినియోగంపై దాఖలైన పిటిషన్లో హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం తాజాగా ఈ వ్యాఖ్యలు చేసింది.
బెలందూర్లోకి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరా టవర్స్‌కు చెందిన పబ్బరెడ్డి కోదండరామిరెడ్డికి వ్యతిరేకంగా ఉప్కార్ రెసిడెన్సెస్ ఈ పిటిషన్ దాఖలు చేసింది. లే అవుట్‌కు సంబంధించి రైట్స్ ఆఫ్ ఇంగ్రెస్, ఎగ్రెస్ (ప్రవేశ, నిష్క్రమణ హక్కులు) తమకు ఇప్పించాలని పిటిషనర్లు కోరారు. అయితే, గేటెడ్ కమ్యూనిటీలోని రోడ్లపై పూర్తి హక్కులు తమవేనని కోదండరామి రెడ్డి వాదించారు. ఆ వీధులు గేటెడ్ కమ్యూనిటీ వాసుల వినియోగానికి మాత్రమేనని పేర్కొన్నారు.
అయితే, ఈ కేసుపై గతంలో సింగిల్ జడ్జి ధర్మాసనం కోదండరామిరెడ్డికి వ్యతిరేకంగా తీర్పు వెలువరించింది. గేటెడ్ కమ్యూనిటీ అనే భావనే చట్టంలో లేదన్న న్యాయస్థానం, కమ్యూనిటీ వీధులను ప్రజలు వాడుకోకుండా అభ్యంతరం చెప్పే హక్కు ఆయనకు లేదని స్పష్టం చేసింది.
ఈ తీర్పును సవాలు చేస్తూ కోదండరామిరెడ్డి హైకోర్టు ద్విసభ్య ధర్మాసనాన్ని ఆశ్రయించగా న్యాయస్థానం తాజాగా ఆయన అప్పీలును కొట్టేసింది. చట్టానికి అనుగుణంగా ఉన్న ఏకసభ్య ధర్మాసనం తీర్పులో తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. లేఅవుట్ శాంక్షన్ అయిన సందర్భంలోనే ప్రజావసరాలకు గేటెడ్ కమ్యూనిటీ రోడ్ల వినియోగంపై నిబంధనలను సంబంధిత ప్రభుత్వ విభాగాలు స్పష్టంగా పేర్కొన్నాయని వ్యాఖ్యానించింది. ఈ నిబంధనల ప్రకారం, రోడ్ల నిర్వహణ స్థానిక సంస్థలది, వీటి వినియోగంపై ప్రజలకు పూర్తి హక్కు ఉంటుంది.