Nagarjuna Sagar Dam: కొనసాగుతున్న ఉద్రిక్తత.. నాగార్జున సాగర్ డ్యామ్ వద్దకు భారీగా చేరుకుంటున్న తెలంగాణ పోలీసులు
- నిన్న ఉదయం డ్యామ్‌ను తమ అధీనంలోకి తీసుకున్న ఏపీ పోలీసులు
- 13వ గేట్ నుంచి తమదేంటూ ముళ్లకంచె ఏర్పాటు
- తొలగించేందుకు తెలంగాణ పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు విఫలం
- ఏపీది దుందుడుకు చర్యేనన్న కిషన్‌రెడ్డి
నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద నిన్న మొదలైన హైటెన్షన్ నేడు కూడా కొనసాగుతోంది. డ్యామ్‌కు అటువైపు ఏపీ, ఇటువైపు తెలంగాణ పోలీసులు మోహరించడంతో ఉద్రిక్తత ఇంకా కొనసాగుతోంది. డ్యామ్‌లోని 13వ గేటు నుంచి తమ పరిధిలోకి వస్తుందని చెబుతూ ఏపీ పోలీసులు నిన్న వేసిన ముళ్లకంచెను తొలగించేందుకు తెలంగాణ పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఈ ఉదయం కూడా ఆ ప్రయత్నాన్ని ఏపీ పోలీసులు అడ్డుకున్నారు.
మరోవైపు, ఒంగోలు చీఫ్ ఇంజినీర్ ఆధ్వర్యంలో సాగర్ కుడికాల్వ ద్వారా ఏపీకి నీటి విడుదల కొనసాగుతోంది. నిన్న ఎన్నికల విధుల్లో ఉన్న తెలంగాణ పోలీసులు ఈ ఉదయం డ్యామ్ వద్దకు చేరుకుంటున్నారు. సాగర్ వద్ద ఉద్రిక్తతపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పందిస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరును ఖండించారు. ఇది పూర్తిగా శాంతిభద్రతల సమస్య కిందికే వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కేంద్రానికి లేఖ రాసి మరోమారు ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతానని పేర్కొన్నారు.