Finger in Salad: సలాడ్‌లో మనిషి వేలు.. రెస్టారెంట్‌కు వెళ్లిన మహిళకు భారీ షాక్!
- న్యూయార్క్ నగరంలోని చాప్ట్ రెస్టారెంట్లో ఏప్రిల్‌లో ఘటన
- తాను మనిషి వేలు నమిలిన విషయం గుర్తించి దిమ్మెరపోయిన కస్టమర్
- రెస్టారెంట్ నుంచి పరిహారం కోరుతూ తాజాగా కోర్టులో కేసు
అమెరికాలో ఓ మహిళకు షాకింగ్ అనుభవం ఎదురైంది. రెస్టారెంట్లో ఆర్డరిచ్చిన సలాడ్‌లో మనిషి వేలు ఉందన్న విషయం గుర్తించిన ఆమె చివరకు రెస్టారెంట్ యాజమాన్యంపై కోర్టుకెక్కింది. న్యూయార్క్ నగరంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రీన్ విచ్‌కు చెందిన యాలిసన్ కోజీ ఏప్రిల్ 7న న్యూయార్క్‌లోని ప్రముఖ చాప్ట్ రెస్టారెంట్‌కు వెళ్లి సలాడ్ ఆర్డరిచ్చింది. అయితే, సలాడ్ తింటున్న ఆమె తను మనిషి వేలును నమిలిన విషయాన్ని గుర్తించి దిమ్మెరపోయింది. ఈ క్రమంలోనే, ఆమె రెస్టారెంట్‌పై కోర్టులో కేసు దాఖలు చేసింది.
కేసు వివరాల ప్రకారం, ఘటనకు ముందురోజు రెస్టారెంట్ సిబ్బందిలో ఒకరు కూరలు తరుగుతుండగా ప్రమాదవశాత్తూ అతడి వేలు తెగింది. వెంటనే అక్కడున్న వారు బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో తెగిపడిన వేలు కూరగాయల్లో ఉండిపోవడంతో చివరకు అది సలాడ్‌లో కలిసింది. కాగా, స్థానిక ఆరోగ్య విభాగం అధికారులు రెస్టారెంట్‌పై ఇప్పటికే జరిమానా విధించారు. అయితే, ఘటన కారణంగా తనకు శారీరక, మానసిక సమస్యలు వచ్చాయని బాధితురాలు తన పిటిషన్లో పేర్కొంది. తనకు రెస్టారెంట్ చెయిన్ నిర్వాహకులు నగదు రూపంలో పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. ఈ పరిణామంపై రెస్టారెంట్ నిర్వాహకులు ఇంకా స్పందించాల్సి ఉంది.