Indian Student: అమెరికాలో ముగ్గురు ఏపీ వ్యక్తుల కిరాతకం.. విద్యార్థిని 7 నెలలుగా హింసిస్తూ రాక్షసానందం!
- 20 ఏళ్ల విద్యార్థిపై సత్తారు వెంకటేశ్ రెడ్డి, నిఖిల్, శ్రవణ్ ల పైశాచికత్వం
- ఇనుప రాడ్లు, వైర్లు, పీవీసీ పైపులతో కొడుతూ రాక్షసానందం
- ముగ్గురిని అరెస్ట్ చేసిన అమెరికా పోలీసులు
అగ్రరాజ్యం అమెరికాలో ఏపీకి చెందిన ముగ్గురు వ్యక్తులు చేసిన కిరాతకాలు వెలుగులోకి వచ్చాయి. 20 ఏళ్ల విద్యార్థిని బంధించి, తీవ్రంగా హింసిస్తూ వీరు రాక్షసానందం పొందారు. దాదాపు 7 నెలల పాటు వారి రాక్షస క్రీడ కొనసాగింది. మిస్సోరి రాష్ట్రంలోని సెయింట్ లూయిస్ పరిధిలో ఈ దారుణం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే... 20 ఏళ్ల బాధిత యువకుడిపై సత్తారు వెంకటేశ్ రెడ్డి, నిఖిల్, శ్రవణ్ లు తమ పైశాచికత్వాన్ని ప్రదర్శించారు. ఓ రెస్టారెంట్ లో బాధిత యువకుడు మరో వ్యక్తికి ఎంతో బాధగా కనిపించాడు. దీంతో, ఆ వ్యక్తి బాధిత యువకుడిని కలిసి ఏదైనా సమస్య ఉంటే తనకు ఫోన్ చేయమని ఫోన్ నెంబర్ ఇచ్చాడు. దీంతో, ఈ ముగ్గురు తనను టార్చర్ చేస్తున్న విధానాన్ని వాట్సాప్ ద్వారా అతనికి తెలియజేశాడు. ఈ దారుణం గురించి తెలుసుకున్న ఆయన చలించిపోయి పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే ఆ ముగ్గురు ఉంటున్న నివాసానికి పోలీసులు వెళ్లారు. అయితే పోలీసులు లోపలకు వచ్చేందుకు ఆ ముగ్గురు నిరాకరించారు. పోలీసులు వచ్చిన విషయాన్ని గ్రహించిన బాధితుడు... వెంటనే వారి వద్దకు వచ్చి తన బాధలను చెప్పుకున్నాడు. తనను రక్షించాలని కోరాడు. అనంతరం ముగ్గురుని పోలీసులు అరెస్ట్ చేశారు. మానవ అక్రమ రవాణా, హింసించడం తదితర సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు.
తనను ప్రతిరోజు పీవీసీ పైపులు, ఇనుప రాడ్లు, విద్యుత్ వైర్లతో చావబాదేవారని బాధితుడు చెప్పాడు. తాను బాధతో విలవిల్లాడుతుంటే రాక్షసానందం పొందేవారని తెలిపాడు. వాళ్ల దెబ్బలకు నుదుటి నుంచి పాదాల వరకు గాయాలయ్యాయని... పక్కటెముకలతో పాటు పలు చోట్ల ఎముకలు కూడా విరిగాయని కంటతడి పెట్టుకున్నాడు. ఇంట్లో పని మొత్తం తనతో చేయించేవారని, వెంకటేశ్ రెడ్డి ప్రతి రోజు 2 గంటల సేపు మసాజ్ చేయించుకునేవాడని చెప్పాడు. చెప్పిన పనులు చేయకపోతే మరింత హింసించేవారని తెలిపాడు. రోజుకు కేవలం 3 గంటలు మాత్రమే పడుకునేందుకు అనుమతించేవారని చెప్పాడు. వీళ్ల హింస కారణంగా అమెరికాకు వచ్చిన తర్వాత 7 నెలల్లో తాను ఏకంగా 30 కిలోల బరువు తగ్గానని వాపోయాడు. తీవ్రంగా నీరసించిపోయిన బాధితుడికి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే వీళ్ల వద్దకు బాధితుడు ఎందుకు వచ్చాడు? బాధితుడిని వీళ్లు హింసించడానికి గల కారణాలు ఏమిటనే విషయం తెలియాల్సి ఉంది.