Kaleswaram Project: కాళేశ్వరం డిజైన్లకు సీడబ్ల్యూసీ ఆమోదం లేదు..ఎన్‌డీఎస్‌ఏ లేఖ

Kaleswaram project designs does not have CWC approval says NDSA
  • తెలంగాణ లేఖకు ఎన్‌డీఎస్ఏ ప్రత్యుత్తరం
  • రాష్ట్ర ఇరిగేషన్ శాఖ డిజైన్లనే డీపీఆర్‌తో సమర్పించారని వెల్లడి
  • కాళేశ్వరం ప్లానింగ్, డిజైన్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్‌లో లోపాలున్నాయన్న ఎన్‌డీఎస్ఏ
కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లకు సీడబ్ల్యూసీ ఆమోదం తెలపలేదని నేషనల్ డ్యామ్ సెఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్ఏ) పేర్కొంది. తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లోని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ ఆమోదించిన డిజైన్లనే డీపీఆర్‌తోపాటూ సమర్పించారని తెలిపింది. బ్యారేజీ కుంగిన ఘటనపై తాము 20 రకాల డాక్యుమెంట్లు కోరామని, కానీ ప్రభుత్వం కొన్నింటినే ఇచ్చిందని వెల్లడించింది. వాటి ఆధారంగానే తాము నివేదిక ఇచ్చామని స్పష్టం చేసింది. 

బ్యారేజీ కుంగిన నేపథ్యంలో ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన ఎన్‌డీఎస్ఏ బృందం ఆ తరువాత రాష్ట్ర ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు, ఇంజినీర్లతో సమావేశమైంది. అనంతరం.. ప్రభుత్వ అధికారులు ఇచ్చిన సమాచారం పరిగణనలోకి తీసుకుని నివేదిక ఇచ్చింది. ఈ నివేదికపై రాష్ట్ర ఇరిగేషన్ స్పెషల్ సీఎస్ రజత్ కుమార్ ఎన్డీఎస్ఏ చైర్మన్‌కు లేఖ రాయగా సంస్థ కూడా తాజాగా ప్రత్యుత్తరమిచ్చింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగడానికి ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లోపాలున్నాయని మరోసారి చెప్పింది. అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాక్‌లో పిల్లర్ కుంగిపోయిన విషయం తెలిసిందే. 

బ్యారేజీలోని ఏడో బ్లాక్‌లోని పిల్లర్లు కుంగిపోయి, వాటిల్లో పగుళ్లు వచ్చాయని ఎన్డీఎస్ఏ పేర్కొంది. పిల్లర్లు ముందుకు కదిలాయని తన లేఖలో స్పష్టం చేసింది. ఇందుకు కారణాలపై స్టడీ చేయాలని ఇప్పటికే తాము తెలంగాణ ప్రభుత్వానికి సూచించామని తెలిపింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునాదుల కింది నుంచి పైపింగ్ జరిగిందని ఎన్డీఎస్ఏ తెలిపింది. మేడిగడ్డ బ్యారేజీలో నిర్మాణ లోపాలపై కేంద్ర కమిటీకి సమగ్రమైన అవగాహన ఉందని వ్యాఖ్యానించింది. ఆ అవగాహనతోనే నిర్ధారణకు వచ్చామని, తాము నిరాధారంగా నివేదిక ఇవ్వలేదని తేల్చి చెప్పింది. నిరంతర పర్యవేక్షణ, నిర్వహణ లోపంతోనూ సమస్య తలెత్తింది పేర్కొంది.
Kaleswaram Project
NDSA
Telangana

More Telugu News