Lakshman: తిరుమల శ్రీవారి నిధులు దారిమళ్లుతున్నాయి: బీజేపీ ఎంపీ లక్ష్మణ్
- నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న లక్ష్మణ్
- భక్తుల విరాళాలు దేవుడి కోసమే ఉపయోగించాలని స్పష్టీకరణ
- ప్రాచీన నిర్మాణాల కూల్చివేతల్లో భక్తుల మనోభావాలను గౌరవించాలని హితవు
రాజ్యసభ సభ్యుడు, తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తిరుమల శ్రీవారి నిధులు దారిమళ్లుతున్నాయని ఆరోపించారు. వెంకటేశ్వరస్వామివారికి భక్తులు సమర్పించే కానుకలను టీటీడీ ధర్మప్రచారం కోసమే వినియోగించాలని స్పష్టం చేశారు.
భక్తులు ఇచ్చే విరాళాలు దేవుని కైంకర్యాలకు ఉపయోగిస్తేనే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. తిరుపతి నగర అభివృద్ధికి ప్రభుత్వ నిధులను కానీ, నగరపాలక సంస్థ నిధులను కానీ ఉపయోగించాలని సూచించారు.
ప్రాచీన నిర్మాణాల కూల్చివేతల్లో టీటీడీ భక్తుల మనోభావాలను గౌరవించాలని లక్ష్మణ్ హితవు పలికారు. పార్వేట మండపం పునర్ నిర్మించే సమయంలో టీటీడీ పురావస్తు శాఖను సంప్రదించిందో లేదో భక్తులకు తెలియజెప్పాలని కోరారు.