Mallu Bhatti Vikramarka: సీఎం అభ్యర్థిత్వంపై భట్టి విక్రమార్క స్పందన ఇదే
- పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు సీఎం అయితే బాగుంటుందని కోరుకుంటానన్న భట్టి
- తన సీఎం అభ్యర్థిత్వంపై జరుగుతున్న చర్చను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తానని వెల్లడి
- మొదటి కేబినెట్ భేటీలో ఆరు గ్యారంటీలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని వివరణ
పార్టీ కోసం పాదయాత్ర చేసి ప్రజలకు హామీలు ఇచ్చాను కాబట్టి ఆ హామీలను అమలు పరచేందుకు ముఖ్యమంత్రి పదవి వస్తే బాగుంటుందని కోరుకుంటానని కాంగ్రెస్ సీనియర్ నేత, మధిరలో విజయం సాధించిన భట్టి విక్రమార్క అన్నారు. తాను సీఎం రేసులో ఉన్నానంటూ చర్చ జరుగుతున్న మాట వాస్తవమేనని, ఆ చర్చను పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తానని మనసులో మాట చెప్పారు. అంతిమంగా ఇది పార్టీ అంతర్గత విషయమని, పార్టీలోనే చర్చించుకుంటామని అన్నారు. మధిర నియోజకవర్గంలో విజయం అనంతరం ఓ మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ విధంగా అన్నారు. మంత్రివర్గ కూర్పు, సీఎం అభ్యర్థి ఎవరనే అంశాలపై స్పందిస్తూ.. ఊహాగానాలు, ప్రచారాలు ఎన్ని ఉన్నా అంతిమ నిర్ణయం అధిష్ఠానానిదేనని చెప్పారు. అది కావాలి ఇది కావాలని ఎవరికి వారు అనుకున్నా.. ఎవరికి ఏ బాధ్యత అప్పగిస్తే బావుంటుందనేది హైకమాండ్ నిర్ణయిస్తుందని అన్నారు. అంతిమంగా కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలు, ఇతర గ్యారంటీలు ప్రకటించడం తమ లక్ష్యంగా ఉంటుందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
ఇక బీఆర్ఎస్ ఈ స్థాయిలో ఓటమి పాలవ్వడం, కాంగ్రెస్ అదిరిపోయే విజయాన్ని సాధించడంపై ఆయన స్పందించారు. రాష్ట్రంలో స్వతంత్రంగా లేదని ప్రజలు భావించారని, సాధించుకున్న రాష్ట్రంలో సంపదను ప్రజలకు పంచకుండా పాలకులు దోచుకున్నారని ప్రజలు భావించారని అన్నారు. ‘‘ నీళ్లు రాలేదు. నిధులన్నీ ఖర్చయ్యి పోయాయి. ఉద్యోగాలు లేవు. బలహీన వర్గాలకు వచ్చే ఏ సంక్షేమ పథకాలు అందలేదు. ఇళ్లు లేవు. ఇళ్ల స్థలాలు లేవు. చదువుకున్న విద్యార్థులకు కావాల్సిన అవకాశాలు లేవు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని నేను రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేశాను. బడుగు బలహీనవర్గాలు, నిరుద్యోగులు, రైతులు పెద్ద ఎత్తున పాదయాత్రలో పాల్గొని ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకు రావాల్సిందేనని చెప్పారు. ఇందిరమ్మ రాజ్యంతో ప్రజలకు సంపదను పంచాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలవబోతోందని అప్పుడే చెప్పాను’’ అని భట్టి విక్రమార్క అన్నారు.
ఇక కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు, ఇతర హామీలపై స్పందిస్తూ.. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి కేబినెట్‌లోనే నిర్ణయం తీసుకుని అమలు చేసేలా అడుగులు వేస్తామని అన్నారు. మేనిఫెస్టోని కూడా దశలవారీగా పూర్తిగా అమలు చేస్తామని పేర్కొన్నారు. మేనిఫెస్టోని సంపూర్ణంగా అమలు చేస్తామని, గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని అమలు చేసిందని గుర్తుచేశారు.