Cyclone Michaung: 'మిగ్జామ్' తుపాను ధాటికి వణికిపోతున్న చెన్నై... ప్రజలు ఎవరూ బయటికి రావొద్దని హెచ్చరిక
- బంగాళాఖాతంలో మిగ్జామ్ తుపాను
- మరింత బలపడిన వైనం
- చెన్నైకి తూర్పు ఈశాన్యంగా 90 కి.మీ దూరంలో తుపాను
- ఈ ఉదయం నాటికి చెన్నైలో 34 సెం.మీ వర్షపాతం నమోదు
- చెన్నై నగరం జలమయం
నైరుతి బంగాళాఖాతాన్ని ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన 'మిగ్జామ్' తుపాను తమిళనాడుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా చెన్నై నగరాన్ని అతలాకుతలం చేస్తోంది. నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో నగరం మొత్తం జలమయం అయింది. స్కూళ్లు, కార్యాలయాలు మూతపడ్డాయి. ఈ రాత్రి 11 గంటల వరకు విమాన సర్వీసులు నిలిపివేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
కొన్ని భవన సముదాయాల నడుమ పార్క్ చేసిన కార్లు నీటి ప్రవాహంలో కొట్టుకుని పోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోగా, తాము గత 24 గంటలుగా అంధకారంలో మగ్గుతున్నామని ప్రజలు చెబుతున్నారు.
ఈ పరిస్థితుల నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం చెన్నై, చెంగల్పట్టు, తిరువళ్లూర్, కాంచీపురం జిల్లాల్లో పబ్లిక్ హాలీడే ప్రకటించింది. ఈ నాలుగు జిల్లాల్లో సోమవారం నాడు కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని తమిళనాడు సీఎస్ శివ్ దాస్ మీనా పేర్కొన్నారు. ఈ నాలుగు జిల్లాల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు కార్యాలయాలు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు సోమవారం నాడు మూసివేయాలని సీఎస్ ఆదేశించారు. విపత్తు నిర్వహణ, సహాయక చర్యలతో సంబంధం ఉండే అన్ని అత్యవసర సర్వీసులు, హోటళ్లు, రెస్టారెంట్లు సాధారణ కార్యకలాపాలు కొనసాగించుకోవచ్చని పేర్కొన్నారు.
సోమవారం ఉదయం నాటికి 34 సెంమీ వర్షపాతం నమోదైన నేపథ్యంలో చెన్నై ప్రజలు బయటికి రావొద్దని నగరపాలక వర్గాలు విజ్ఞప్తి చేశాయి.