Mohammed Muizzu: సైనిక దళాల ఉపసంహరణకు భారత్ అంగీకరించింది: మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మయిజ్జు
- దుబాయ్ లో ప్రపంచ వాతావరణ సదస్సు
- భేటీ అయిన మోదీ, మయిజ్జు
- కీలక అంశాలపై చర్చ
దుబాయ్ లో ప్రపంచ పర్యావరణ సదస్సు సీఓపీ-28 సందర్భంగా భారత్ ప్రధాని నరేంద్ర మోదీ, మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మయిజ్జు భేటీ అయ్యారు. సమావేశం అనంతరం మయిజ్జు మీడియాతో మాట్లాడారు. మాల్దీవుల్లో మోహరించిన భారత సైన్యాన్ని ఉపసంహరించేందుకు ప్రధాని మోదీ అంగీకరించారని వెల్లడించారు.
దాదాపు 70 వేల మంది భారత సైనికులు మాల్దీవుల్లో ఉన్నారు. మాల్దీవుల్లో భారత సహకారంతో రాడార్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మాల్దీవులకు భారత్ నిఘా విమానాలను కూడా అందించింది. ఆ రాడార్ కేంద్రాలు, నిఘా విమానాల పర్యవేక్షణ కోసం భారత బలగాలు మాల్దీవుల్లో ఉన్నాయి.
అయితే, మాల్దీవుల ఎన్నికల సందర్భంగా... తాను గెలిస్తే భారత బలగాలను వెనక్కి పంపిస్తానని మహ్మద్ మయిజ్జు ఎన్నికల హామీ ఇచ్చారు. తమ గడ్డపై భారత దళాలు ఉండరాదని, తాము పూర్తి స్వతంత్రంగా ఉండాలని భావిస్తున్నామని స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలవడంతో ఆయన తన హామీ నిలుపుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు.
ఈ క్రమంలోనే భారత సైన్యం ఉపసంహరణపై దుబాయ్ వేదికగా ప్రధాని మోదీతో చర్చించారు. భారత ప్రధాని నుంచి సైన్యం వెనక్కి వెళ్లిపోయే దిశగా సానుకూల స్పందన వచ్చిందని మాల్దీవుల అధ్యక్షుడు మయిజ్జు వెల్లడించారు.