Congress: కాంగ్రెస్ పార్టీ గెలుపుపై ధర్మపురి అర్వింద్ ఆసక్తికర వ్యాఖ్యలు
- బీజేపీ బలంగా ఉన్నప్పటికీ.. ఏడాదిలో కాంగ్రెస్ బాగా పుంజుకుందన్న అర్వింద్
- కేసీఆర్ శకం ముగిసింది.. బీఆర్ఎస్‌కు ఇవే చివరి ఎన్నికలని జోస్యం
- బీజేపీకి ఎనిమిది సీట్లే రావడంపై పార్టీలో చర్చ జరగాలని వ్యాఖ్య
- రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన అర్వింద్
సంవత్సరం క్రితం వరకు బీజేపీ తెలంగాణలో చాలా బలంగా ఉందని, కానీ ఈ ఏడాదిలో కాంగ్రెస్ బాగా పుంజుకొని.. ఏకంగా అధికారంలోకి వచ్చిందని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ శకం ముగిసిందని, బీఆర్ఎస్‌కు ఇవే చివరి ఎన్నికలని జోస్యం చెప్పారు. తెలంగాణ రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చాయన్నారు. హుందాతనమైన భాష ఇప్పుడు వస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు.
కాంగ్రెస్ పార్టీలో ఈ తరహా భాష ఉండదని.. దాడుల సంస్కృతి ఉండదని భావిస్తున్నామన్నారు. తెలంగాణలో నీచమైన రాజకీయాలకు స్వస్తి పలుకుతూ స్వచ్ఛమైన రాజకీయాలు చేద్దామని పిలుపునిచ్చారు. బీజేపీకి ఎనిమిది సీట్లే ఎందుకు వచ్చాయన్న చర్చ చేయాల్సి ఉందన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అని ప్రజలకు అర్థమైంది కాబట్టే ఈ ఫలితాలు వెలువడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. లిక్కర్ కేసులో కవితను జైలుకు పంపకపోవడం కూడా ఒక కారణమన్నారు. దీనికి సంబంధించి పార్టీలో చర్చ అవసరమన్నారు.
ఏది ఏమైనా కేసీఆర్ ఓడిపోయినందుకు తమకు సగం సంతోషంగా ఉందన్నారు. రేవంత్ రెడ్డి గ్రేట్ లీడర్ అని కితాబునిచ్చారు. రేవంత్ రెడ్డి కూడా కిందిస్థాయి నుంచి వచ్చిన వ్యక్తి అని గుర్తు చేశారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోయే రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు అన్నారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలే ఉంటాయని జోస్యం చెప్పారు. కేంద్రంలో మళ్లీ బీజేపీయే అధికారంలోకి వస్తుందన్నారు. బలమైన అభ్యర్థి లేని చోటు నుంచి తాను పోటీ చేశానని, తన పార్లమెంట్ పరిధిలో రెండు స్థానాలు గెలిచామన్నారు. కోరుట్ల ప్రజలందరికీ ధన్యవాదాలు అన్నారు. తనను ప్రజలు ఎంపీగానే చూశారన్నారు. రూపాయి పంచకుండా తాను రాజకీయాలు చేశానన్నారు.