Chandrababu: మిగ్జామ్ తుపాను ఎఫెక్ట్.. చంద్రబాబు శ్రీశైలం పర్యటన వాయిదా

Chandrababu visit to Srisailam postponed due to Cyclone Michaung
  • శ్రీశైలం మల్లన్న దర్శనాన్ని వాయిదా వేసుకున్న టీడీపీ అధినేత
  • మిగ్జామ్ తుపాను తీవ్రత దృష్ట్యా నిర్ణయం
  • త్వరలోనే శ్రీశైలంతోపాటు కడప దర్గా, మేరీమాత చర్చిల సందర్శన
మిగ్జామ్ తుపాను ప్రభావంతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉండడంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. శ్రీశైలం పర్యటనను వాయిదా వేసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం మంగళవారం ఆయన శ్రీశైలం మల్లన్నను దర్శించుకోవాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా సిద్ధమయ్యాయి. అయితే తుపాను ప్రభావం తగ్గిన తర్వాత దర్శించుకోవాలని అధినేత నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఇదిలావుంచితే స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో బెయిల్ లభించిన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీలోని దేవాలయాలను సందర్శిస్తున్నారు. ఈ మధ్యే తిరుమలలో శ్రీవారిని, విజయవాడలో కనకదుర్గమ్మ, సింహాచలంలో అప్పన్నను దర్శించుకున్నారు. త్వరలోనే శ్రీశైలం మల్లన్నతోపాటు కడప దర్గా, మేరీమాత చర్చిలను ఆయన సందర్శించనున్నారు. కాగా ఆలయాల సందర్శనకు వెళ్తున్న చంద్రబాబుకు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతాలు పలుకుతున్నాయి. భారీ ర్యాలీలతో అధినేతకు మద్దతుగా నిలుస్తున్నాయి.
Chandrababu
Srisailam
Cyclone Michaung
Telugudesam

More Telugu News