Nagarjunasagar Dam: నాగార్జునసాగర్ డ్యామ్ వివాదంలో కేఆర్ఎంబీకి తెలంగాణ ఈఎన్సీ విజ్ఞప్తి

Telangana ENC wrote KRMB Chairman on Nagarjunasagar dam issue

  • ఇటీవల నాగార్జునసాగర్ వద్ద ఉద్రిక్తతలు
  • కీలక సమావేశం ఏర్పాటు చేసిన కేంద్ర హోంశాఖ
  • నవంబరు 28కి పూర్వం ఉన్న స్థితిని పునరుద్ధరించాలన్న తెలంగాణ
  • కేఆర్ఎంబీ చైర్మన్ కు లేఖ రాసిన తెలంగాణ ఈఎన్సీ

ఇటీవల (నవంబరు 29) నాగార్జునసాగర్ డ్యామ్ పై ఏపీ, తెలంగాణ ప్రభుత్వ వర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. డ్యామ్ లోని పలు గేట్లను స్వాధీనం చేసుకున్న ఏపీ పోలీసులు నీటిని దిగువకు విడుదల చేశారు. 

ఈ సందర్భంగా ఏపీ పోలీసులకు, తెలంగాణ పోలీసులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ అంశంలో కేంద్ర హోంశాఖ చొరవ తీసుకుని ఇటీవలే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ నేపథ్యంలో, నవంబరు 28కి పూర్వం ఉన్న పరిస్థితిని పునరుద్ధరించాలంటూ తాజాగా తెలంగాణ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ రావు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కి విజ్ఞప్తి చేశారు. 

కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఇటీవల నిర్వహించిన సమావేశంలో పేర్కొన్న మేరకు నాగార్జునసాగర్ ప్రాజెక్టు బాధ్యతలు తెలంగాణ వద్దే ఉంచాలని కోరారు. అందుకు అనుగుణంగా ఏపీ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకునేలా చూడాలని పేర్కొన్నారు.

సాగర్ డ్యామ్ వద్ద సీఆర్పీఎఫ్ బలగాల భద్రత ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి తెలంగాణ ప్రభుత్వం సహకరించిందని ఈఎన్సీ మురళీధర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన కేఆర్ఎంబీ చైర్మన్ కు లేఖ రాశారు.

  • Loading...

More Telugu News