Cyclone Michaung: బాపట్ల వద్ద తీరం దాటనున్న తుపాను.. పార్టీ శ్రేణులకు చంద్రబాబు సూచన
- తుపాను ప్రభావంతో ఏపీని ముంచెత్తుతున్న వర్షాలు
- తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొనాలని కార్యకర్తలు, నాయకులకు చంద్రబాబు సూచన
- అవసరమైన చోట్ల నిత్యావసరాలు అందించాలన్న బాబు
మిగ్జామ్ తుపాను నేపథ్యంలో పార్టీ శ్రేణులకు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కీలక సూచన చేశారు. అందరూ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇబ్బందులు పడుతున్న ప్రజలకు నాయకులు, కార్యకర్తలు అండగా నిలవాలని కోరారు. సహాయక చర్యల్లో విస్తృతంగా పాల్గొనాలని ఆదేశించారు. అత్యవసరమైన చోట నాయకులు, కార్యకర్తలు తమవంతు సాయం అందించాలని, ప్రజలకు నిత్యావసరాలు అందించాలని, లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే సహాయక చర్యల్లో పాల్గొనాలని సూచించారు.
తుపాను ప్రభావంతో చిత్తూరు, నెల్లూరు సహా రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలుతున్నాయి. కరెంటు లేక ప్రజలు చీకట్లోనే గడుపుతున్నారు. లోతట్టు ప్రాంతాలు వరదనీటితో నిండిపోయాయి. పలు జిల్లాల్లో కోట్లాదిరూపాయల పంట నష్టం వాటిల్లింది. కాగా, తుపాను మరికాసేపట్లో బాపట్ల వద్ద తీరం దాటనుంది. ఆ సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది.