Chandrababu: తుపాను బాధిత గ్రామాల ప్రజలతో ఫోన్ లో మాట్లాడిన చంద్రబాబు... ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

Chandrababu talks to people in Cyclone Michaung effected villages
  • ఏపీపై పంజా విసిరిన మిగ్జామ్ తుపాను
  • పార్టీ శ్రేణులతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్
  • కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా ఉండాలంటూ పార్టీ నేతలు, కార్యకర్తలకు సూచన
  • హుద్ హుద్, తిత్లీ తుఫాన్ల సమయంలో పరిహారం పెంచి సాయం చేశామని వెల్లడి
మిగ్జామ్ తుపాను ఏపీ కోస్తా జిల్లాలను అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. తుపాను బాధిత ప్రజలకు తక్షణ అవసరం అయిన ఆహారం, నీళ్లు, షెల్టర్ ఇవ్వడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని విమర్శించారు. తుపానుపై ప్రభుత్వ సన్నద్ధతా లేదు... బాధితులకు సాయమూ లేదు అని ఎత్తిపొడిచారు. 

కాగా, తుపాను బాధిత గ్రామాలకు చెందిన కొందరు ప్రజలతో చంద్రబాబు నేరుగా ఫోన్ లో మాట్లాడారు. ప్రభుత్వ సాయంపై ఆరా తీశారు. తమకు కనీసం భోజనం కూడా పెట్టలేదని, ప్రభుత్వ స్పందన సరిగా లేదని వివిధ ప్రాంతాల్లోని ప్రజలు చంద్రబాబుకు చెప్పారు. 

తుపాను ప్రభావంపై దాదాపు 12 వేల మంది పార్టీ నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో పరిస్థితులపై నాయకులతో మాట్లాడారు. క్షేత్ర స్థాయిలో ఉన్న నాయకుల ద్వారా పలు గ్రామాల ప్రజలతో మాట్లాడారు. వారి బాగోగులు తెలుసుకున్నారు. 

ప్రభుత్వం సాయం కోసం ఎదురు చూడకుండా... పార్టీ నాయకులు, కార్యకర్తలు బాధిత ప్రజలకు అండగా ఉండాలి అని సూచించారు. వెంటనే భోజనం, తాగునీరు అందేలా చూడాలని నేతలకు చెప్పారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం పని చేస్తుందని తెలిపారు. ఈ కష్ట సమయంలో చేతనైన సాయం ద్వారా ప్రజలకు అండగా నిలవాలని పార్టీ శ్రేణులకు సూచించారు. 

ఈ ప్రభుత్వం మాటలు కోటలు దాటుతున్నాయే తప్ప చేతలు గడప కూడా దాటడం లేదని చంద్రబాబు విమర్శించారు. దీనికి క్షేత్ర స్థాయి పరిస్థితులే నిదర్శనం అని మండిపడ్డారు. మిగ్జామ్ తుపాను తీవ్ర స్థాయి విపత్తు అని ముందే తెలిసినా... ప్రజలను అప్రమత్తం చేయడంలో విఫలం అయ్యారని... వ్యవస్థల నిర్వీర్యం వల్లనే నేడు ఈ దుస్థితి వచ్చిందని అన్నారు. 

హుద్ హుద్, తిత్లీ తుఫాన్ల సమయంలో ప్రత్యేక జీవోలతో సాయం

విపత్తుల సమయంలో రైతులను ఆదుకోవడానికి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రత్యేక జీవోలు ఇచ్చి సాయం అందించామని చంద్రబాబు వెల్లడించారు. హుద్ హుద్ సమయంలో జీవో నెం.9 ద్వారా, తిత్లీ తుపాను సమయంలో జీవో నెం.14 ద్వారా నష్టపరిహారం పెంచి రైతులకు అండగా నిలబడ్డామని వివరించారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం లెక్కలు వేసుకోకుండా ఉదారంగా వ్యవహరించాలని చంద్రబాబు హితవు పలికారు. 

నాటితో పోల్చుకుంటే నేడు పెరిగిన సాగు ఖర్చులు, ఇతర భారాలను దృష్టిలో పెట్టుకుని పరిహారం మరింత పెంచి ఇవ్వాలి అని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని తెలుగుదేశం పార్టీ నేతలకు స్పష్టం చేశారు.
Chandrababu
Cyclone Michaung
Villages
TDP
Andhra Pradesh

More Telugu News