Maxwell: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న మ్యాక్స్‌వెల్.. ఆసక్తికర వ్యాఖ్యలు
- ప్రధాని మోదీతో కరచాలనం చేసిన కెప్టెన్ పాట్ కమ్మిన్స్ చాలాసేపు పోడియం మీదే ఉన్నాడన్న మ్యాక్సీ
- ఆటగాళ్లు అందరూ వెళ్లేవరకు కెప్టెన్ అక్కడే ఉండడం సరదాగా ఉందని వ్యాఖ్య
- ట్రోఫీ అందుకున్న నాటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న స్టార్ ఆల్‌రౌండర్
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియాపై ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆస్ట్రేలియా ఆటగాళ్లు ట్రోఫీని అందుకున్నారు. ట్రోఫీని అందుకున్న అనంతరం మైదానంలో సెలబ్రేట్ చేసుకున్నారు. ఫొటోలకు పోజులిచ్చారు. ఆ జ్ఞాపకాలను ఆసీస్ స్టార్ ప్లేయర్ గ్లేన్ మ్యాక్స్‌వెల్ గుర్తుచేసుకున్నాడు. కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ట్రోఫీని అందుకున్న తీరు సరదాగా అనిపించిందని చెప్పాడు.
ట్రోఫీ అందుకోవడానికి పోడియం మీదకు వెళ్లిన పాట్ కమ్మిన్స్ అక్కడే ఆగిపోయాడని సరదాగా వ్యాఖ్యానించాడు. ప్రధాని మోదీతో కరచాలనం అనంతరం చాలాసేపు అక్కడే ఉన్నాడని, ఫైనల్ నాటి వీడియోలు చూస్తుంటే చాలా ఫన్నీగా ఉందని చెప్పాడు. ఈ మేరకు ‘ది ఏజ్‌డాట్ కామ్’ అనే వెబ్‌సైట్‌తో ముచ్చటించాడు. పాట్ కమ్మిన్స్ ట్రోపీ అందుకోవడం దాదాపు 10 నిమిషాలపాటు కొనసాగినట్లు అనిపించిందని మ్యాక్స్‌వెల్ గుర్తుచేసుకున్నాడు. మిగతా ఆటగాళ్లు వెళ్లే వరకు అక్కడే ఉన్నాడని, కానీ చాలా హుందాగా వ్యవహరించాడని అభిప్రాయపడ్డాడు. కమ్మిన్స్ గొప్పలు చెప్పుకోలేదని అన్నాడు. గౌరవంగా వ్యవహరించాలని అతడు భావిస్తున్నట్టుగా తనకు అనిపించిదని చెప్పాడు. అందరూ ఈ విధంగా వ్యవహరించలేరని మ్యాక్స్‌వెల్ అభిప్రాయపడ్డాడు.
కాగా వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఫ్యాన్స్‌ను తీవ్ర నిరాశకు గురి చేసిన విషయం తెలిసిందే. వరుసగా 10 విజయాలు అందుకున్న భారత్ ఫైనల్ మ్యాచ్‌లో భంగపాటుకు గురయ్యింది. రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టు భారత్‌ను తక్కువ స్కోరుకే నియంత్రించింది. ఆ తర్వాత సునాయాసంగా లక్ష్యాన్ని చేధించిన విషయం తెలిసిందే.