Digvijay Singh: కాంగ్రెస్ ఓటమికి ఈవీఎంలే కారణం: దిగ్విజయ్ సింగ్
- మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్
- ఈవీఎంలను తాను 2003 నుంచి వ్యతిరేకిస్తున్నానన్న దిగ్విజయ్ సింగ్
- ప్రజాస్వామ్యాన్ని సుప్రీంకోర్టు, సీఈసీ కాపాడాలని విన్నపం
మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి ఈవీఎంలే కారణమని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. ఈవీఎంల ద్వారా ఓటింగ్ జరపడాన్ని తాను 2003 నుంచి వ్యతిరేకిస్తున్నానని చెప్పారు. చిప్ ఉండే ఏ మెషీన్ ను అయినా హ్యాక్ చేయవచ్చని అన్నారు. భారత ప్రజాస్వామ్యాన్ని హ్యాకర్లు నియంత్రించడాన్ని మనం అంగీకరిద్దామా? అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు, కేంద్ర ఎన్నికల సంఘం ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. కౌంటింగ్ కు ముందే ఖచ్రోడ్ అసెంబ్లీ నియోజకవర్గ ఫలితాలు బీజేపీ నేత అనిల్ ఛజేద్ కు ఎలా తెలుసని ప్రశ్నించారు. ఆయన ముందే చెప్పిన ఫలితాలు, చివరకు వచ్చిన ఫలితాలు ఒకేలా ఉన్నాయని తెలిపారు. మరోవైపు, ఈ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మండిపడ్డారు. గెలిస్తే వారికి ఈవీఎంలు మంచివని... ఓడిపోతే వాటిపై నింద వేస్తారని దుయ్యబట్టారు.