Drunk Driving: నిజామాబాద్ బబ్లూని నేను.. ఈ రోజే నిన్ను లేపేస్తా.. డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికి, ఆర్ఎస్ఐని నానా బూతులు తిట్టిన మందుబాబు
- జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో పోలీసుల డ్రంకెన్ డ్రైవ్
- సందీప్ రక్తంలో 75 శాతం ఆల్కహాల్
- కారును పక్కనపెట్టి వీల్ క్యాంప్ వేసిన పోలీసులు
- బలవంతంగా తొలగించి దాంతో పరారైన సందీప్
- వీల్ క్యాంప్ ఇవ్వాలని ఫోన్ చేసిన ఆర్ఎస్ఐని లేపేస్తానని బెదిరింపు
- పలు సెక్షన్ల కింద కేసు నమోదు
జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో మంగళవారం రాత్రి నిర్వహిస్తున్న డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికిన వాహనదారుడు పోలీసులను నానాబూతులు తిట్టాడు. అక్కడితో ఆగక తానెవరో మీకు తెలియదని, తాను తంతే పడాలని హెచ్చరించాడు. తాను నిజామాబాద్ బబ్లూని అని, ఈ రోజే నిన్ను లేపేస్తానంటూ తనను పట్టుకున్న జూబ్లీహిల్స్ ట్రాఫిక్ ఆర్ఎస్ఐ అశోక్‌కు తీవ్ర పదజాలంతో హెచ్చరికలు జారీ చేశాడు.
ఆ మందుబాబు పేరు సందీప్. శ్వాస పరీక్షలో అతడి రక్తంలో ఆల్కహాల్ శాతం 75గా నమోదు కావడంతో అశోక్ ఆయనపై కేసు నమోదు చేశారు. ఎవరైనా మద్యం తాగని వ్యక్తితో వచ్చి కారును తీసుకెళ్లాలని పక్కనపెట్టారు. అలా కుదరదని, కారును తనకే ఇవ్వాలని సందీప్ పట్టుబట్టడంతో కారు కదలకుండా వీల్క్యాంప్ బిగించారు. అయినప్పటికీ పోలీసులను ఏమార్చిన సందీప్ దానిని తొలగించి క్లాంప్‌తో సహా పరారయ్యాడు.
గమనించిన ఆర్ఎస్ఐ అశోక్.. సందీప్‌కు ఫోన్ చేసి వీల్క్యాంప్ ప్రభుత్వ ఆస్తి కాబట్టి దానిని తిరిగి ఇవ్వాలని కోరారు. దీంతో మరింత రెచ్చిపోయిన సందీప్.. అసభ్య పదజాలంతో అశోక్‌ను దూషిస్తూ.. తన కారును పట్టుకునేందుకు ఎంత ధైర్యమని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘‘నువ్వు నా జీతగాడివి. నేను తంతే పడాలి. నేను కానీ తలచుకుంటే ఈ రోజే నిన్ను లేపేస్తా. నేనసలే నిజామాబాద్ బబ్లూని, నన్నెవరూ ఏమీ చేయలేరు జాగ్రత్త’’ అని ఓ రేంజ్లో ఫైరయ్యాడు. అక్కడితో ఆగక బుధవారం తెల్లవారుజామున మరోమారు అశోక్‌కు ఫోన్ చేసి బెదిరింపులకు దిగాడు. ఆర్ఎస్ఐ ఫిర్యాదుతో సందీప్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.