Bullet Rail: రైల్వే స్టేషనా? అంతర్జాతీయ విమానాశ్రయమా?: దేశంలోని తొలి బుల్లెట్ రైలు స్టేషన్ గ్లింప్స్ ఇదిగో!
- అహ్మదాబాద్‌లోని సబర్మతి మల్టీమోడల్ ట్రాన్స్‌పోర్ట్ హబ్‌లో బుల్లెట్ రైలు స్టేషన్
- 1.33 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో జంట నిర్మాణాలు
- అహ్మదాబాద్-ముంబై మధ్య బుల్లెట్ రైలు
అబ్బబ్బ.. ఏం సోయగం! అత్యాధునిక హంగులతో చూడ్డానికి అది అచ్చం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తలపిస్తోంది. కానీ నిజానికి అది రైల్వే స్టేషన్. ఈ వీడియోను చూసినవారెవరూ అది రైల్వే స్టేషన్ అంటే నమ్మడం కష్టమే. అయినా, నమ్మి తీరాల్సిందే. అదెక్కడుందో తెలుసా? గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో. దేశంలోని తొలి బుల్లెట్ ట్రైన్ రైల్వే స్టేషన్ ఇది. సబర్మతి మల్టీమోడల్ ట్రాన్స్‌పోర్ట్ హబ్‌లోని ఈ రైల్వేస్టేషన్ గ్లింప్స్‌ను రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.
మోదీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అహ్మదాబాద్-ముంబై మధ్య నిర్మిస్తున్న హైస్పీడ్ రైల్ కారిడార్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. దేశంలోని రెండు ఆర్థిక నగరాలను కలుపుతున్న ఈ రైలు మార్గం 508 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఈ మార్గంలో 26 కిలోమీటర్ల మేర సొరంగాలు, 10 కిలోమీటర్ల మేర వంతెనలు, ఏడు కిలోమీటర్లు మేర కరకట్టలు ఉన్నాయి.
ఇక, అహ్మదాబాద్‌లోని బుల్లెట్ రైలు స్టేషన్ విషయానికి వస్తే మొత్తం 1.33 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. హబ్ భవనంలో కార్యాలయాలు, వాణిజ్య కేంద్రాలు, ప్రయాణికుల కోసం రిటైల్ అవుట్‌లెట్లతో జంట నిర్మాణాలు ఉన్నాయి.