CM Jagan: తుపాను కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో ఇంటింటికీ రూ.2,500: సీఎం జగన్

CM Jagan visits cyclone hit districts
  • ఏపీ కోస్తా జిల్లాలపై మిగ్జామ తుపాను పంజా
  • తిరుపతి, బాపట్ల జిల్లాల్లో పర్యటించిన సీఎం జగన్
  • ప్రతి ఒక్కరినీ ఆదుకుంటామని వెల్లడి
మిగ్జామ్ తుపాను కారణంగా దెబ్బతిన్న తిరుపతి, బాపట్ల జిల్లాల్లో ఏపీ సీఎం జగన్ నేడు పర్యటించారు. తిరుపతి జిల్లా బాలిరెడ్డిపాలెంలో ఆయన మాట్లాడుతూ, తుపాను వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో వాలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బంది ఇంటింటికీ తిరిగి రూ.2,500 ఇస్తారని వెల్లడించారు. 

పంట నష్టపోయిన వారు కూడా బాధపడాల్సిన పనిలేదని, ప్రతి రైతును ఆదుకుంటామని చెప్పారు. పంట నష్టపోయిన రైతులకు 80 శాతం సబ్సిడీతో విత్తనాలు సరఫరా చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాలు మరో వారం రోజుల్లో కార్యరూపం దాల్చుతాయని, జిల్లా కలెక్టర్లు దగ్గరుండి పర్యవేక్షిస్తారని స్పష్టం చేశారు. 

తుపాను కారణంగా దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించేందుకు అధికారులు, సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారని, ఎక్కడెక్కడి నుంచో ప్రత్యేక బృందాలను తీసుకువచ్చి వీలైనంత వేగంగా విద్యుత్ సరఫరా సజావుగా జరిగేలా చూసేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని వివరించారు. 

రోడ్లను బాగు చేసే కార్యక్రమాలు కూడా చేపడతామని సీఎం జగన్ తెలిపారు. ప్రభుత్వం నుంచి ఎవరికైనా సాయం దక్కకపోతే 1902 నెంబరుకు ఫోన్ చేస్తే తన కార్యాలయానికే కాల్ వస్తుందని సీఎం జగన్ పేర్కొన్నారు.
CM Jagan
Cyclone Michaung
Tirupati
Bapatla

More Telugu News