David Warner: ఆసీస్ మాజీ ఆటగాడు మిచెల్ జాన్సన్ వ్యాఖ్యలపై డేవిడ్ వార్నర్ స్పందన

Warner counters Mitchell Johnson remarks

  • టెస్టు క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్న డేవిడ్ వార్నర్
  • పాకిస్థాన్ తో తొలి టెస్టుకు వార్నర్ ను కూడా ఎంపిక చేసిన ఆసీస్ బోర్డు
  • సిడ్నీ టెస్టు ద్వారా సొంతగడ్డపై వార్నర్ వీడ్కోలు పలకొచ్చన్నది బోర్డు ఆలోచన
  • ఈ నిర్ణయాన్ని తప్పుబట్టిన మిచెల్ జాన్సన్
  • బాల్ టాంపరింగ్ కు పాల్పడిన వార్నర్ కు ఇలాంటి వీడ్కోలు అవసరమా అంటూ వ్యాఖ్యలు

ఆస్ట్రేలియా మాజీ పేసర్ మిచెల్ జాన్సన్ చేసిన వ్యాఖ్యలపై సీనియర్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ స్పందించాడు. ఒకరి వ్యక్తిగత అభిప్రాయాలను తాను పట్టించుకోనని, ముందుకు వెళ్లడమే తనకు తెలుసని వార్నర్ స్పష్టం చేశాడు. తన తల్లిదండ్రుల పెంపకం చాలా గొప్పదని, కష్టించి పనిచేయడం ఎలాగో తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నానని, ఇప్పటికీ అదే చేస్తుంటానని వివరించాడు. అంతర్జాతీయ స్థాయికి చేరుకున్న తర్వాత అనేక విమర్శలు వస్తుంటాయని, వాటిని ఎదుర్కోక తప్పదని వార్నర్ అభిప్రాయపడ్డాడు. తన టెస్టు కెరీర్ కు అద్భుతమైన ముగింపు లభిస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. 

వరల్డ్ కప్ ముగిశాక టెస్టు క్రికెట్ కు వీడ్కోలు పలుకుతానని వార్నర్ గతంలో ప్రకటించాడు. వార్నర్ ప్రకటనకు అనుగుణంగా అతడిని పాకిస్థాన్ తో తొలి టెస్టుకు ఎంపిక చేశారు. వార్నర్ సొంత గడ్డ సిడ్నీలో జరిగే ఈ టెస్టు ద్వారా ఐదు రోజుల ఫార్మాట్ కు వీడ్కోలు పలుకుతాడని క్రికెట్ ఆస్ట్రేలియా (ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు) భావిస్తోంది. ఈ నిర్ణయాన్ని ఆసీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ మిచెల్ జాన్సన్ బాహాటంగా తప్పుబట్టాడు. వార్నర్ గతంలో బాల్ టాంపరింగ్ కు పాల్పడిన వ్యక్తి అని, ఇంతటి ఘనమైన వీడ్కోలు అందుకునే అర్హత అతడికి లేదని విమర్శించాడు. 

ఈ వ్యాఖ్యలపైనే వార్నర్ స్పందించాడు. ప్రతి ఒక్కరికీ తమ వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయని, వాటిని వెల్లడించుకునే స్వేచ్ఛ కూడా వారికి ఉంటుందని జాన్సన్ వ్యాఖ్యలను వార్నర్ తేలిగ్గా తీసిపారేశాడు.

  • Loading...

More Telugu News