Revanth Reddy: తుది శ్వాస వరకు అటు కొడంగల్.. ఇటు మల్కాజ్‌గిరి నా ఊపిరి: సీఎం రేవంత్ రెడ్డి
- మల్కాజ్ గిరి లోక సభ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు వెల్లడి
- మల్కాజ్ గిరి ప్రజలతో తన అనుబంధం శాశ్వతమన్న రేవంత్ రెడ్డి
- తాను వ్యక్తిగతంగా అనుకున్నంత సమయం ఇవ్వకపోయినా అర్థం చేసుకున్నారని మెచ్చుకోలు
తాను లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేశానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తన చివరి శ్వాస వరకు అటు కొడంగల్... ఇటు మల్కాజ్‌గిరి నా ఊపిరి అని ట్వీట్ చేశారు. లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన అనంతరం ఆయన ట్వీట్ చేశారు. 'లోక్ సభ సభ్యత్వానికి నేడు రాజీనామా చేశాను. ఈ రాజీనామా నా ఎంపీ పదవికి మాత్రమే… నా మనసులో మల్కాజ్‌గిరి ప్రజల స్థానం శాశ్వతం. ప్రశ్నించే గొంతుకగా నన్ను పార్లమెంటుకు పంపిన ఇక్కడి ప్రజలతో నా అనుబంధం శాశ్వతం' అని పేర్కొన్నారు. తన రాజకీయ ప్రస్థానంలో కొడంగల్‌కు ఎంత ప్రత్యేకత ఉందో... మల్కాజిగిరికీ అంతే ప్రత్యేకత ఉందన్నారు. తనను దేశానికి పరిచయం చేసిన ఘనత మల్కాజిగిరి ప్రజలదే అన్నారు.
ఏ విశ్వాసంతో.. ఏ అభిమానంతో... తనను గెలిపించారో అయిదేళ్లుగా మీరు ఆశించిన ప్రశ్నించే గొంతుగా ప్రజల పక్షాన పోరాడినట్లు తెలిపారు. విస్తృత బాధ్యతల నేపథ్యంలో వ్యక్తిగతంగా కొన్నిసార్లు అనుకున్నంత సమయం ఇవ్వలేకపోయి ఉండవచ్చునని, అలాంటి సమయంలో తన పరిస్థితిని మల్కాజ్‌గిరి ప్రజలు సహృదయంతో అర్థం చేసుకున్నట్లు తెలిపారు. దేశ రక్షణ కోసం పంపించినట్లుగా తెలంగాణ రక్షణ కోసం తనను గెలిపించి పంపించారన్నారు. మల్కాజ్‌గిరి ప్రజలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. మల్కాజ్ గిరికి ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పారు. నాడు మీరు పోసిన ఊపిరి... చివరి శ్వాస వరకు తెలంగాణ ఉజ్వల భవిత కోసం తపిస్తూనే ఉంటానని పేర్కొన్నారు.