Medigadda Project: మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటు.. కేసును సీబీఐకి అప్పగించాలంటూ హైకోర్టులో పిల్
- హైకోర్టులో పిల్ వేసిన జి.నిరంజన్
- బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పిటిషన్ లో విన్నపం
- కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ రూ. 86 వేల కోట్లు సేకరించడంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని విన్నపం
మేడిగడ్డ ప్రాజెక్లు పిల్లర్లు కూలడం తెలంగాణలో సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో ఈ అంశం బీఆర్ఎస్ ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకతను తీసుకొచ్చిందనే చెప్పుకోవాలి. మరోవైపు, పిల్లర్ల కుంగుబాటుపై జయశంకర్ జిల్లా మహదేవపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. ఈ కేసును సీబీఐకి బదలాయించాలని హైకోర్టులో పిల్ దాఖలయింది. ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని పీసీసీ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ దాఖలు చేశారు. జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ నవంబర్ 1వ తేదీన ఇచ్చిన నివేదిక ఆధారంగా బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలను జారీ చేయాలని పిటిషన్ లో కోరారు. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ రూ. 86 వేల కోట్లు సేకరించడంపై కూడా సీబీఐతో దర్యాప్తు చేయించాలని విన్నవించారు. ఈ పిటిషన్ ప్రస్తుతం హైకోర్టు రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది.