Allu Aravind: 'తండేల్' అంటే అర్థం ఏమిటో సినిమా చూశాక తెలుస్తుంది: అల్లు అరవింద్
- నాగచైతన్య, సాయిపల్లవి జంటగా తండేల్
- నేడు హైదరాబాదులో ఘనంగా ప్రారంభం
- 'తండేల్' అర్థం తెలుసుకునేందుకు చాలామంది ప్రయత్నిస్తున్నారన్న అరవింద్
- ఆ సందేహాలు అలాగే ఉంచండి అంటూ వ్యాఖ్యలు
నాగచైతన్య, సాయిపల్లవి జంటగా 'తండేల్' చిత్రం నేడు ప్రారంభమైంది. హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోస్ గ్లాస్ హౌస్ లో ఈ చిత్రం ముహూర్తం షాట్ చిత్రీకరించారు. ఇప్పటివరకు నాగచైతన్య కెరీర్ లో ఇదే అత్యంత భారీ బడ్జెట్ చిత్రం. 'తండేల్' చిత్రాన్ని గీతా ఆర్ట్స్ నిర్మిస్తోంది.
సినిమా ఓపెనింగ్ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్ర నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడారు. 'తండేల్' అంటే అర్థం ఏమిటో తెలుసుకునేందుకు అందరూ ప్రయత్నిస్తున్నారని, అయితే సినిమా చూశాకే అందరికీ 'తండేల్' అంటే ఏమిటన్నది తెలుస్తుందని వెల్లడించారు. అప్పటివరకు ఆ సందేహాలను అలాగే ఉంచండి... సినిమాతోనే సమాధానం చెబుతాం అని అల్లు అరవింద్ తెలిపారు.
"గతేడాది నుంచి 'తండేల్' చిత్రం కోసం సన్నద్ధమవుతున్నాం. ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులు ఒక సరికొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టిన అనుభూతి పొందుతారు. దర్శకుడు చందూ మొండేటికి అనేక హిట్లు వచ్చినప్పటికీ, మాకు ఇచ్చిన మాట కోసం ఈ చిత్రం చేస్తున్నారు. ఇచ్చిన మాటపై నిలబడే వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. వారిలో చందూ ఒకడు. కార్తికేయ-2 తర్వాత చందూకు అనేక అవకాశాలు వచ్చాయి. కానీ మా కోసం అన్నింటినీ వెనక్కి నెట్టాడు. ఈ కథపై అతడు ఏడాదిన్నరగా శ్రమిస్తున్నాడు. నాగచైతన్య కూడా ఈ సినిమా కోసం పూర్తిగా దృష్టి సారించాడు" అని అల్లు అరవింద్ వివరించారు.