ndtv: సీఎం రేవంత్ నుంచి ఫస్ట్ ఉచిత బస్సు ప్రయాణం టిక్కెట్ పొందిన జర్నలిస్ట్ ఉమా సుధీర్
- ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ ప్రభుత్వం
- తెలంగాణ సీఎంవో నుంచి టిక్కెట్ పొందినట్లు ట్వీట్
- ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే హామీని అమలు చేశారంటూ కితాబు
కాంగ్రెస్ ప్రభుత్వం... ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఈ రోజు రెండు గ్యారంటీలను లాంఛనంగా ప్రారంభించింది. మహిళలకు ఈ రోజు నుంచి రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఒక్కటొక్కటిగా వంద రోజుల్లో అమలు చేస్తామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచే పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అయితే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంలో భాగంగా మొదటి టిక్కెట్‌ను ప్రముఖ జర్నలిస్ట్ ఉమా సుధీర్‌కు అందించారు. ఆమె ఎన్డీటీవీలో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.
ఇందుకు సంబంధించి ఉమా సుధీర్ తాను తొలి జీరో టిక్కెట్ పొందినట్లు (ఉచిత ప్రయాణ టిక్కెట్) ట్వీట్ చేశారు. తెలంగాణ సీఎంవో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నుంచి ఉచిత టిక్కెట్‌ను పొందినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రెండు రోజుల్లోనే ఈ హామీని నెరవేర్చిందని, రోజుకు రూ.6 కోట్ల భారం ప్రభుత్వంపై పడుతుందన్నారు.