Team India: రేపటి నుంచి దక్షిణాఫ్రికాలో టీమిండియా సుదీర్ఘ పర్యటన
- టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య ఆసక్తికర సమరం
- మూడు టీ20లు, మూడు వన్డేలు, 2 టెస్టులు ఆడనున్న టీమిండియా
- రేపు డర్బన్ లో తొలి టీ20
దక్షిణాఫ్రికా గడ్డపై రేపటి నుంచి టీమిండియా పర్యటన షురూ కానుంది. డిసెంబరు 10 నుంచి జనవరి 7 వరకు జరిగే సుదీర్ఘ పర్యటనలో టీమిండియా మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. ఈ సిరీస్ కోసం టీమిండియా మూడు ఫార్మాట్లకు వేర్వేరుగా జట్లను ప్రకటించింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, షమీ, బుమ్రా పరిమిత ఓవర్ల సిరీస్ లకు దూరంగా ఉండనున్నారు. వారు టెస్టు సిరీస్ కు జట్టులోకి రానున్నారు.
భారత టీ20 జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా వ్యవహరించనుండగా, వన్డే జట్టుకు కేఎల్ రాహుల్ నాయకత్వం వహిస్తాడు. టెస్టుల్లో టీమిండియాను రోహిత్ శర్మ నడిపించనున్నాడు. ఈ సుదీర్ఘ పర్యటన టీ20 సిరీస్ తో ప్రారంభం అవుతోంది. రేపు (డిసెంబరు 10) డర్బన్ లోని కింగ్స్ మీడ్ స్టేడియంలో టీమిండియా, దక్షిణాఫ్రికా జట్లు తొలి టీ20లో తలపడనున్నాయి.
తొలి టీ20- డిసెంబరు 10 (డర్బన్)
రెండో టీ20- డిసెంబరు 12 (కెబెరా)
మూడో టీ20- డిసెంబరు 14 (జొహాన్నెస్ బర్గ్)
తొలి వన్డే- డిసెంబరు 17 (జొహాన్నెస్ బర్గ్)
రెండో వన్డే- డిసెంబరు 19 (కెబెరా)
మూడో వన్డే- డిసెంబరు 21 (పార్ల్)
తొలి టెస్టు- డిసెంబరు 26 నుంచి 30 వరకు (సెంచురియన్)
రెండో టెస్టు- జనవరి 3 నుంచి 7 వరకు (కేప్ టౌన్)