Jairam Ramesh: కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు ధీరజ్‌దిగా చెబుతున్న రూ. 300 కోట్లు స్వాధీనం.. తమకు సంబంధం లేదన్న జైరాం రమేశ్
- ఒడిశాలోని బౌధ్ డిస్టలరీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాంగణంలో ఐటీ సోదాలు
- దాదాపు రూ. 300 కోట్ల నగదు స్వాధీనం
- ధీరజ్ సాహు వ్యాపారాలతో పార్టీకి సంబంధం లేదన్న జైరాం రమేశ్
- ప్రజల నుంచి దోచుకున్న సొమ్మును తిరిగి వారికే ఇస్తామన్న మోదీ
ఒడిశా, ఝార్ఖండ్‌లలో కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు ధీరజ్ సాహుకు సంబంధించిన పలు ప్రాంతాల్లో ఆదాయ పన్నుశాఖ నిర్వహించిన దాడుల్లో లెక్కల్లో చూపని దాదాపు రూ.300 కోట్ల నగదు బయపడడం సంచలనమైంది. బుధవారం దాడులు ప్రారంభించగా, అవి ఇంకా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ స్పందించారు. ధీరజ్ సాహు వ్యాపారాలతో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధమూ లేదని స్పష్టం చేశారు. అధికారులు పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్న సొమ్ముపై ఆయన మాత్రమే చెప్పగలరని పేర్కొన్నారు. ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్న మొత్తంలో ఎక్కువ భాగం ఒడిశాలోని బౌధ్ డిస్టలరీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాంగణంలోనే లభ్యమైనట్టు తెలుస్తోంది.
కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు ధీరజ్ సాహుకు చెందిన ప్రాంతాల్లో పెద్దమొత్తంలో నగదు లభ్యం కావడంపై బీజేపీ నేతలు విమర్శనాస్త్రాలు సంధించారు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతూ.. ధీరజ్ అవినీతిలో భాగం కావడం ఇదే తొలిసారి కాదని విమర్శించారు. కుంభకోణం ఎక్కడ జరిగితే అక్కడ కాంగ్రెస్ నేత ఎందుకు ఉంటారని ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా ఎక్స్ ద్వారా కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. ప్రజల నుంచి దోచుకున్న ఈ సొమ్మును తిరిగి వారికే ఇచ్చేస్తామని పేర్కొన్నారు.