Kishan Reddy: కాంగ్రెస్ పార్టీ ఎలాంటిదో చెప్పడానికి ఇదొక ఉదాహరణ: కిషన్ రెడ్డి
- కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్
- కర్ణాటకలో ఆర్నెల్లు కాకముందే కాంగ్రెస్ అవినీతి షురూ చేసిందన్న కిషన్ రెడ్డి
- కర్ణాటకలో ఓ నేత నుంచి తెలంగాణకు భారీగా డబ్బు తరలించారని ఆరోపణ
తెలంగాణ బీజేపీ చీఫ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై ధ్వజమెత్తారు. ఎక్కడ కాంగ్రెస్ ఉంటే అక్కడ అవినీతి విజృంభిస్తుందని, దేశ ఆర్థిక వ్యవస్థను కాంగ్రెస్ పార్టీ చెదలు పట్టినట్టుగా తొలుస్తుందని విమర్శించారు.
కర్ణాటకలో అధికారం పీఠం ఎక్కి ఆర్నెల్లు కూడా కాకముందే కాంగ్రెస్ అవినీతికి తెరలేపిందని అన్నారు. ఈ దోపిడీకి భయపడి కర్ణాటకలోని బిల్డర్లు పొరుగు రాష్ట్రాలకు పారిపోతున్నారని, కాంగ్రెస్ పాలన ఎలా ఉంటుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ అని వివరించారు. కర్ణాటకలో కాంగ్రెస్ ను గెలిపించినందుకు ప్రజలు ఇప్పుడు తలపట్టుకుంటున్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
ఝార్ఖండ్ లో కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు నివాసంపై ఐటీ దాడులు జరిగితే రూ.290 కోట్లు దొరికాయని, అవినీతికి పాల్పడే సీఎంలను, ఎంపీలను కాంగ్రెస్ పార్టీ ఏటీఎంలుగా మార్చుకుంటుందని విమర్శించారు.
ఇటీవల కర్ణాటక నుంచి భారీ ఎత్తున తెలంగాణకు తరలించిన డబ్బు పట్టుబడిందని తెలిపారు. ధీరజ్ సాహు తరహాలోనే కర్ణాటకలోని ఓ నేత నుంచి ఈ డబ్బు తరలించారని కిషన్ రెడ్డి ఆరోపించారు. త్వరలో పార్లమెంటు ఎన్నికలు రానున్నాయని, కాంగ్రెస్ కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు.