CPS: సీపీఎస్ రద్దు చేయలేదంటూ ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఆత్మహత్యాయత్నం... పరిస్థితి విషమం
- అనంతపురం జిల్లా పెన్నహోబిలం వద్ద ఘటన
- సీపీఎస్ రద్దు చేస్తానని చెప్పి జగన్ మాట తప్పారన్న టీచర్ మల్లేశ్
- విషపు గుళికలు తిని ఆత్మహత్య యత్నం
- ఆసుపత్రికి తరలించిన స్థానికులు
- ఐదు పేజీల సూసైడ్ నోట్ రాసిన మల్లేశ్
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం చిన్న ముస్తూరు గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు మల్లేశ్ ఆత్మహత్యానికి పాల్పడ్డారు. సీపీఎస్ రద్దు చేస్తానని చెప్పిన సీఎం జగన్ మాట తప్పి మోసం చేశారని, అందుకే బలవ్మనరణానికి పాల్పడుతున్నానని మల్లేశ్ ఐదు పేజీల లేఖ రాశారు. తన చావుకు సీఎం జగనే కారణమని పేర్కొన్నారు.
ఈ లేఖను ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో తీవ్ర కలకలం రేగింది. మల్లేశ్ తన ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేసి, పెన్నహోబిలం ఆలయం పరిసరాల్లో వ్యవసాయంలో ఉపయోగించే విషపు గుళికలు తిని ఆత్మహత్య యత్నం చేశాడు. మల్లేశ్ ను గమనించిన స్థానికులు వెంటనే అనంతపురం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
సీపీఎస్ రద్దు చేయడం, ప్రతి నెలా 5వ తేదీ లోపు జీతాలు ఇవ్వడం తన చివరి కోరిక అని ఆ ప్రభుత్వ ఉపాధ్యాయుడు తన సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు.