TSRTC: మహిళలకు టిక్కెట్లు కొట్టిన కండక్టర్.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వివరణ

TSRTC conductor issues ticket to female passenger sajjanar issues clarification
  • నిజామాబాద్‌లో మహిళలకు టిక్కెట్టు ఇచ్చిన ఆర్టీసీ కండక్టర్
  • ఘటన వీడియో వైరల్, నెట్టింట విమర్శలు
  • కండక్టర్‌పై విచారణకు ఆదేశించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్
  • ఉద్దేశపూర్వకంగా మహిళలకు కండక్టర్ టిక్కెట్టు కొట్టలేదని వివరణ
తెలంగాణలో మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ పథకం అమల్లో ఉండగా మహిళలకు టిక్కెట్లు జారీ చేసిన కండక్టర్ ఉదంతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. నిజామాబాద్‌లో జరిగిన ఈ ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తాజాగా వివరణ ఇచ్చారు. కండక్టర్ ఉద్దేశపూర్వకంగా మహిళలతో టిక్కెట్లు కొనిపించలేదని స్పష్టం చేశారు. 

నిజామాబాద్ నుంచి బోధన్ వెళుతున్న పల్లె వెలుగు బస్సులో నిజామాబాద్ టౌన్ బస్టాండ్ వద్ద ఆదివారం ఒక పురుషుడు, ఇద్దరు మహిళలు ఎక్కారు. టిక్కెట్లు ఇవ్వమని పురుష ప్రయాణికుడు అడిగితే కండక్టర్ మూడు టిక్కెట్లను ఒక్కోటి రూ.30కి ఇచ్చారు. అయితే, రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉందని ప్రయాణికుడు చెప్పడంతో పొరపాటు జరిగిందని కండక్టర్ వివరించాడు. ముగ్గురూ పురుష ప్రయాణికులే అని అనుకుని 3 టిక్కెట్లు ఇచ్చానని వివరించాడు. ఆ తరువాత కండక్టర్ మహిళల రెండు టిక్కెట్ల డబ్బునూ వెనక్కు ఇచ్చేశాడు. 

అయితే, ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా వైరల్‌గా మారింది. కండక్టర్ ప్రభుత్వ ఆదేశాలు ధిక్కరిస్తూ మహిళలకు టిక్కెట్లు జారీ చేశారన్న ప్రచారం జరిగింది. 

ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెంటనే స్పందించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న కండక్టర్‌ను డిపో స్పేర్‌లో ఉంచి విచారణ చేపట్టారు. అనంతరం,  కండక్టర్ ఉద్దేశపూర్వకంగా ఈ చర్యకు పాల్పడలేదంటూ వివరణ ఇచ్చారు. మహాలక్ష్మి పేరిట ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకంపై ఆర్టీసీ సిబ్బందికి అవగాహన కల్పించామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు.
TSRTC
Mahalakshmi Scheme
Telangana
Revanth Reddy
Congress

More Telugu News