Supreme Court: ఆర్టికల్ 370 రద్దుపై నేడు సుప్రీంకోర్టు తీర్పు.. సర్వత్రా ఉత్కంఠ

The Supreme Courts verdict on the abrogation of Article 370 today

  • జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా తొలగించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై నేడు తీర్పు
  • సుదీర్ఘ విచారణ అనంతరం సెప్టెంబర్ 5న తీర్పుని రిజర్వ్‌లో ఉంచిన రాజ్యాంగ ధర్మాసనం
  • రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత ఏర్పాట్లు 

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను ఉపసంహరిస్తూ 2019లో కేంద్ర ప్రభుత్వం 370 ఆర్టికల్‌ను రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై నేడు (సోమవారం) సుప్రీంకోర్టు తీర్పు వెలువడనుంది. వేర్వేరు పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సుదీర్ఘ విచారణ చేపట్టింది. ఈ ఏడాది ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ వరకు విచారణ జరిపింది. సెప్టెంబరు 5న రిజర్వులో ఉంచిన  తీర్పును సోమవారం వెలువరించనున్నట్టు వెబ్‌సైట్‌లో సుప్రీంకోర్టు పేర్కొంది. కాగా 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. దీనిని స్థానిక రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. కేంద్రం నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. 

కీలక తీర్పు వెలువడనున్న నేపథ్యంలో కశ్మీర్‌లో అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా చర్యలను చేపట్టింది. రెండు వారాలుగా కశ్మీర్‌ లోయలోని 10 జిల్లాల్లో భద్రతా ఏర్పాట్లపై పోలీసులు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కొందరు నాయకులను అదుపులోకి తీసుకోగా మరికొందరిని గృహనిర్బంధంలో ఉంచారు. ప్రజలను రెచ్చగొట్టేవారిపై చర్యలు తప్పవని స్థానిక పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.

సోమవారం(నేడు) వెలువడబోయే తీర్పు పట్ల స్థానిక రాజకీయ పార్టీలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. 370 రద్దుకు అనుకూలంగా తీర్పు వచ్చినా శాంతిభద్రతలకు తమ పార్టీ విఘాతం కలిగించబోదని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్‌ అబ్దుల్లా అన్నారు. తీర్పును ఎవరూ రాజకీయం చేయరాదని, దానిని ప్రతి ఒక్కరూ గౌరవించాలని బీజేపీ పేర్కొంది. కాగా 370 అధికరణం రద్దుకు వ్యతిరేకంగా పోరాడేందుకు జమ్మూకశ్మీర్‌కు చెందిన పార్టీలు గుప్కార్‌ అలయెన్స్‌గా ఏర్పడిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News