DCM in Reservoir: గూగుల్‌ను నమ్మి నట్టేట మునిగిన డ్రైవర్.. రిజర్వాయర్‌లోకి డీసీఎం

Lorry ends up Gouravelli reservoir after driver follows route in google maps
  • హుస్నాబాద్ నుంచి డీసీఎం హైదరాబాద్ వస్తుండగా నందారం వద్ద ఘటన
  • మ్యాప్స్‌లో పొరపాటుతో డీసీఎం కుడివైపునకు బదులు ఎడమవైపునకు మళ్లడంతో ప్రమాదం
  • రాత్రివేళ రోడ్డుపై నీరు నిలిచి ఉందని భావించి రిజర్వాయర్‌లోకి బండిని తోలిన డ్రైవర్
  • చివరి నిమిషంలో అప్రమత్తం కావడంతో తప్పిన ప్రమాదం
గూగుల్‌పై అతివిశ్వాసం ఓ డ్రైవర్‌ను నట్టేట ముంచింది. రాత్రి వేళ గూగుల్‌ మ్యాప్స్‌ రూట్‌‌లో డీసీఎంను నడపడంతో చివరకు అది గౌరవెల్లి రిజర్వాయర్‌లో దిగింది. జరగబోయే ప్రమాదాన్ని డ్రైవర్ చివరి నిమిషంలో గుర్తించడంతో ప్రాణాపాయం తప్పింది. డీసీఎంలోని డ్రైవర్‌, సిబ్బందిని స్థానికులు కాపాడారు.

హన్మకొండ నుంచి మిల్క్ ప్యాకెట్ల లోడుతో ఓ డీసీఎం హుస్నాబాద్‌కు బయలుదేరింది. అక్కడ డెలివరీ పూర్తి చేశాక రాత్రి 10 గంటలకు చేర్యాల మీదుగా హైదరాబాద్ వైపు బయలుదేరింది. గూగుల్ మ్యాప్స్ చూపించిన రూట్లో డ్రైవర్ వాహనం నడిపాడు. 

అయితే, నందారం స్టేజీ వద్ద కుడివైపు మలుపు చూపించాల్సిన మ్యాప్స్ ఎడమవైపు చూపించడంతో డీసీఎం నేరుగా గౌరవెల్లి రిజర్వాయర్ నీటిలోకి వెళ్లిపోయింది. గూగుల్ మ్యాప్‌నే నమ్మిన డ్రైవర్ రోడ్డుపై వాన నీరు నిలిచి ఉందని భావించి రిజర్వాయర్‌లోకి వాహనాన్ని నడిపాడు. అయితే, అంతకంతకూ లారీ నీళ్లల్లోకి దిగబడిపోతుండటంతో తప్పుడు రూట్లో ప్రయాణిస్తున్నామని డ్రైవర్ గ్రహించి వాహనాన్ని వెంటనే నిలిపివేశాడు. అనంతరం, లారీ డ్రైవర్, ఇతర సిబ్బంది ఆర్తనాదాలు చేయగా దాదాపు రెండు గంటల తరువాత స్థానికులు వారిని గుర్తించి బయటకు తీసుకొచ్చారు. మర్నాడు ఉదయం డీసీఎంను బయటకు తీశారు. డ్రైవర్ డీసీఎంను మరికొంతముందుకు పోనిచ్చి ఉంటే అందరూ మరణించి ఉండేవారని స్థానికులు చెబుతున్నారు. 

కాగా, గతంలో తమిళనాడుకు చెందిన ఓ వాహనం కూడా ఇదే విధంగా గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకుని గౌరవెల్లి రిజర్వాయర్‌లోకి దిగింది. గౌరవెల్లి ప్రాజెక్టు కారణంగా పలుమార్గాలు ముంపునకు గురయ్యాయని, ఈ విషయం గూగుల్‌లో అప్‌డేట్ కాకపోవడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.
DCM in Reservoir
Gouravelli Reservoir
Husnabad
Google maps

More Telugu News