Kids Pneumonia: చలికాలంలో పిల్లలకు న్యుమోనియా.. నీలోఫర్‌లో పెరుగుతున్న కేసులు
- ఇప్పటివరకూ నీలోఫర్‌లో 50 పైగా చిన్నారులు చేరిన వైనం
- ఈ సీజన్‌లో చిన్నారులకు 'కంగారూ కేర్' అవసరమంటున్న వైద్యులు
- ఇష్టారీతిన యాంటీబయాటిక్స్ వాడొద్దని సూచన
ఇది చలికాలం కావడంతో చిన్నారులు అధిక సంఖ్యలో న్యుమోనియా బారిన పడుతున్నారు. జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లు నొప్పులు, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది తదితర సమస్యలతో ఇప్పటివరకూ నీలోఫర్ పిల్లల ఆసుపత్రిలో 50 మంది వరకూ చేరారు. కొందరికి 5-6 వారాల పాటు రోగ లక్షణాలు తగ్గకపోవడంతో న్యుమోనియాగా భావించి ఆసుపత్రుల్లో చేరుతున్నారు. అయితే, సొంతవైద్యం, ఇష్టారీతిన యాంటీబయాటిక్స్ వాడటం చేయొద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
చలికాలంలో చిన్నారులు సీజనల్ వ్యాధుల బారినపడకుండా ఉండేందుకు 'కంగారు కేర్' అందించడం అత్యుత్తమమని నీలోఫర్ సూపరింటెండెంట్ డాక్టర్ ఊషారాణి తెలిపారు. కంగారూ జంతువులు తమ పొట్టసంచీలో పిల్లల్ని వెచ్చగా దాచిపెట్టుకునేలా తల్లులు తమ పిల్లలను ఛాతిపై పడుకోపెట్టుకోవాలని సూచించారు. తద్వారా, తల్లి శరీర ఉష్ణోగ్రత పిల్లలను సీజనల్ వ్యాధుల నుంచి కాపాడుతుందని పేర్కొన్నారు. పిల్లలను సాధ్యమైనంత ఎక్కువగా మదర్ కేర్‌లో ఉంచాలని సూచించారు.